- 5జీతో జీడీపీకి 2 శాతం...
- 2030 నాటికి 180 బిలియన్ డాలర్లు
వెలుగు బిజినెస్ డెస్క్: ఫిఫ్త్ జనరేషన్ (5జీ) టెలికం నెట్‌వర్క్‌లు మన దేశ జీడీపీలో 2 శాతం దాకా కంట్రిబ్యూట్ చేసే ఛాన్స్ ఉందని ఒక రిపోర్టు వెల్లడించింది. దీని ప్రకారం 2030 నాటికి జీడీపీలో 5జీ నెట్‌వర్క్‌ల కంట్రిబ్యూషన్ 180 బిలియన్ డాలర్ల దాకా ఉండనుంది. ఆర్థర్ డి లిటిల్‌తో కలిసి ఈ రిపోర్టును నేషనల్ అసోసియేషన్‌ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) తయారు చేసింది. ఎకానమీ పటిష్టమవడంతోపాటు, రంగాలవారీగా సంస్కరణలూ ఇందుకు దారితీస్తాయని పేర్కొంది.
2030 నాటికి 50 కోట్ల 5జీ యూజర్లు...
మన దేశంలో 5 జీ యూజర్ల సంఖ్య 2030 నాటికి 50 కోట్లకు చేరుతుందని, ఈ కారణంగానే ఎకానమీ దిశను మార్చే అవకాశం కలుగుతుందని నాస్కామ్ రిపోర్టు వివరించింది. మొబిలిటీ, హెల్త్‌కేర్, మాన్యుఫాక్చరింగ్, రిటెయిల్, ఎనర్జీ, యుటిలిటీస్ వంటి రంగాలలో 5 జీ నెట్వర్క్ వాడకం పెరుగుతుందని తెలిపింది. దీంతో మన ఎకానమీకి 180 బిలియన్ డాలర్ల మేర మేలు జరుగుతుందని ఆర్థర్ డి లిటిల్ సౌత్ ఏషియా మేనేజింగ్ పార్ట్నర్ బర్నిక్ చిత్రన్ మైత్రా చెప్పారు. 5జీ– అన్‌ఫోల్డింగ్ ఇండియాస్ ఎరా ఆఫ్ డిజిటల్ కన్వర్జన్స్ పేరుతో తాజా రిపోర్టును రిలీజ్ చేశారు.
ప్రస్తుతానికి మనం నెంబర్ 2....
టెలికం యూజర్ల విషయంలో మన దేశం ప్రపంచంలోనే రెండో ప్లేస్‌లో నిలుస్తోంది. దేశంలో 110 కోట్ల మంది యూజర్లుండగా, వీరిలో 74 కోట్ల మంది 4 జీ కస్టమర్లే ఉన్నారు. ఇప్పుడు 5 జీ రాకతో అప్‌గ్రెడేషన్ మరింత ఊపందుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఫలితంగా ఏవరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఆర్పు) రాబోయే కొన్నేళ్లలో బాగా పెరుగుతుందని రిపోర్టు అంచనా వేస్తోంది. టెలికం ఆర్పు 2025 నాటికి రూ. 335 కి చేరొచ్చని పేర్కొంది. స్మార్ట్ఫోన్ల వాడకంతోపాటు, ఓటీటీ కన్జంప్షన్, డిజిటల్ పేమెంట్లు, ఈ–కామర్స్ జోరందుకోవడంతో డిజిటైజేషన్ వేగంగా సాగుతున్నట్లు వివరించింది. ఇవన్నీ కలిసి ఆర్పు పెరిగేలా సాయపడుతున్నట్లు పేర్కొంది. దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలను కలపడానికి తీసుకొచ్చిన నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ (ఎన్ఓఎఫ్ఎన్) ప్రాజెక్టు భారత్‌నెట్ వంటి పాలసీలు 5 జీ విస్తరణకు దోహదపడతాయని నాస్కామ్రిపోర్టు తెలిపింది. 5 జీ ఎక్కువ మందికి చవుకగా చేరేలా ఇలాంటి ప్రాజెక్టులు వీలు కల్పిస్తాయని అభిప్రాయపడింది.
అందరూ కలవాలి...
5 జీ సమర్ధంగా వాడుకోవాలంటే దేశం లోని టెల్కోలు, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్లు (ఓఈఎంలు), ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు, ప్రభుత్వం కలిసి పనిచేయాలని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవ్జాని ఘోష్ చెప్పారు. అప్పుడే ఎక్కువ మంది వినియోగానికి ముందుకు వస్తారని, ఎక్కువ బెనిఫిట్స్ లభిస్తాయని పేర్కొన్నారు. 2025 నాటికి గ్లోబల్‌గా 5 జీ కనెక్షన్లు 400 కోట్లకు చేరుతాయని అంచనా. మొత్తం కనెక్షన్లలో వాటి వాటా 35 శాతంగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు, 5 జీ మొబైల్ సబ్స్క్రిప్షన్లు గ్లోబల్‌గా ఏటా 50 శాతం చొప్పున పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.