దేశంలో అక్టోబర్ 12 నుంచి 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. 5జీ సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టెలికాం ఆపరేటర్లు పనిచేస్తున్నారని తెలిపారు. ఇన్ స్టాలేషన్లు జరుగుతున్నాయని..అక్టోబర్ 12 నాటికి 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. అతి త్వరలో దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలకు 5జీ సేవలను విస్తరిస్తామన్నారు. తొలి దశలో ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్ సహా దేశంలోని 13 ప్రధాన నగరాల పరిధిలో హైస్పీడ్ 5జీ సేవలు ప్రారంభం అవనున్నాయన్నారు. రాబోయే రెండు మూడేళ్లలో దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు కూడా 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు జరుగుతాయన్నారు. 5జీ ధరలు అందరికి అందుబాటులో ఉండేలా ధరలు ఉంటాయన్నారు.
4జీ రెట్టింపు ధరకు 5జీ వేలం
5జీ స్పెక్ట్రమ్ వేలం ముగిసింది. రూ. లక్షా 50వేల 173 కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. మొత్తం 7 రోజుల పాటు 40 రౌండ్లలో బిడ్ల ప్రక్రియ నిర్వహించారు. 5జీ వేలంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి చెందిన జియో టాప్ బిడ్డర్ గా నిలిచింది.జియో రూ. 87,946.93 కోట్ల బిడ్ దాఖలు చేసింది. ఆ తర్వాతి స్థానంలో భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ -ఐడియా ఉన్నాయి. 5జీ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసిన అతిపెద్ద సంస్థగా అవతరించిన...రిలయన్స్ జియో మొదటి విడతగా రూ.7,864 కోట్లు చెల్లించింది. వొడాఫోన్ ఐడియా రూ.1,680 కోట్లు చెల్లించగా, తాజాగా టెలికం రంగంలో అడుగుపెట్టిన అదానీ డేటా నెట్‌వర్క్ తొలి విడతగా రూ.18.94 కోట్లు చెల్లించింది. 4జీ స్పెక్ట్రమ్ రూ.77వేల 815 కోట్లకు అమ్ముడుపోగా... 5జీకి దాదాపు రెట్టింపు మొత్తం వచ్చింది. 2010లో 3జీ స్పెక్ట్రమ్ .. 50వేల 968 కోట్లకు అమ్ముడైంది.
సెక్ట్రమ్ కేటాయింపు కోసం భారీ మొత్తం
5జీ స్పెక్ట్రం కేటాయింపులకు గాను భారతి ఎయిర్‌టెల్, జియో, అదానీ డేటా నెట్‌వర్క్స్, వొడాఫోన్- ఐడియాల నుంచి టెలికాం శాఖకు రూ 17,876 కోట్లు సమకూరాయి. రిలయన్స్ జియో, అదానీ డేటా నెట్‌వర్క్స్ , వొడాఫోన్ ఐడియా 20 సమాన వార్షిక వాయిదాలను చేయడానికి ఎంచుకున్నాయి. అయితే ఇందులో భారతీ ఎయిర్‌టెల్ మాత్రమే ఎక్కువ ముందస్తు మొత్తాన్ని చెల్లించింది. ఎయిర్‌టెల్ రూ. 8,312.4 కోట్లు చెల్లించింది, నాలుగు సంవత్సరాల ముందస్తు వాయిదాలను చెల్లించడం విశేషం.