5జీ టెక్నాలజీతో ప్రపంచంలోనే మొట్టమొదటి రిమోట్ టాటూ
నచ్చిన గుర్తు లేదా పేరును ఒక జ్ఞాపకంగా బాడీపై పచ్చబొట్టుగా వేయించుకునే వారు ఎందరో. అయితే ఇప్పుడు 5జీ టాటూ లేదా రిమోట్ టాటూ అందుబాటులోకి వచ్చింది. 5జీ టాటూ/రిమోట్ టాటూనా? అదేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? పచ్చబొట్టు వేసే వ్యక్తి వేరే చోట ఉంటే.. టాటూ వేయించుకునే వ్యక్తి మరో ప్లేస్‌లో ఉంటారు. ఓ రోబోటిక్ ఆర్మ్ టాటూ వేస్తుంది. అయినా కూడా చేతిపై పచ్చబొట్టు పెర్ఫెక్ట్‌గా పడుతుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి రిమోట్ టాటూను 5జీ టెక్నాలజీతో పనిచేసే రోబోటిక్ ఆర్మ్‌తో కంప్లీట్ చేశారు. అందుకే దీనిని 5జీ టాటూ/రిమోట్ టాటూగా పిలుస్తున్నారు. టాటూ ఆర్టిస్ట్ వెస్ థామస్.. ఓ బొమ్మ చేతితో ఈ డిజైన్ వేస్తే.. వేరే లొకేషన్‌లో ఉన్న రోబో ఆర్మ్ ఆ కదలికలను కాపీ చేసి డచ్ యాక్ట్రెస్ స్టిజిన్ ఫ్రాన్సెన్ చేతిపై పచ్చబొట్టు పొడిచింది. ఫైనల్‌గా ఫ్రాన్సెన్‌కు ఎంతో ఇష్టమైన సర్ఫింగ్ డిజైన్ ఆమె చేతిపై చెరగని గుర్తుగా మారిపోయింది. ప్రస్తుతం ఈ ప్రక్రియను ఇంపాజిబుల్ టాటూ అంటూ అందరూ తెగపొగిడేస్తున్నారు. ఈ ప్రొసీజర్ మొత్తాన్ని టి-మొబైల్ సంస్థ తన నెట్ వర్క్ స్పీడ్‌ను ప్రపంచానికి తెలియజేయడానికి చేపట్టింది. దీనిని మూడు నిమిషాల డాక్యుమెంటరీగా మీడియాకు రిలీజ్ చేసింది.
పండ్లు కూరగాయలపై ప్రాక్టీస్
ఇలా రోబో ఆర్మ్‌తో టాటూ వేయడానికి చాలా రీసెర్చ్ చేశారు. లండన్‌కు చెందిన టెక్నాలజిస్ట్ నియోల్ డ్రూ తన టీమ్‌తో కలిసి రోబోటిక్ ఆర్మ్‌ను డెవలప్ చేశాడు. లాక్‌డౌన్ సమయంలో ఆరు వారాల టైమ్‌లో లాంగ్ డిస్టెన్స్ టాటూ వేసే టెక్నాలజీని ఈ టీమ్ సిద్ధం చేసింది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారంగా దీనిని డిజైన్ చేశారు. ఈ టైమ్‌లో టాటూ ఆర్టిస్ట్ థామస్ వారిని దగ్గరుండి గైడ్ చేశాడు. మనుషుల శరీరంపై రోబో ఆర్మ్ ఎలా మూవ్ అవ్వాలనే దానిపై సలహాలు ఇచ్చాడు. నీడిల్‌కు ఇంక్‌ను డెలివర్ చేసే మెకానికల్ సిస్టంతో రోబో ఆర్మ్‌ను మొత్తానికి రెడీ చేశారు. ఫ్రాన్సెన్ చేతిపై టాటూ వేయడానికి ముందు వీరు చాలా పెద్ద ప్రాక్టీసే చేశారు. టమాట, యాపిల్ లాంటి రకరకాల కూరగాయలు, పండ్లపై టాటూ వేయడాన్ని ప్రాక్టీస్ చేశారు. వాటి రిజల్ట్ ఆధారంగా రోబో ఆర్మ్‌కు మార్పులు చేస్తూ వచ్చారు.
లోతుగా దిగకుండా సెన్సర్ ఏర్పాటు
టాటూ వేయడానికి ముందు ఫ్రాన్సెన్‌తో కూడా థామస్ మాట్లాడాడు. ఎలాంటి డిజైన్ వేయాలనే దానిపై డిస్కస్ చేశాడు. థామస్ తన స్టూడియోలో కూర్చొని బొమ్మ చేతితో డిజైన్ వేయడం మొదలు పెట్టగానే రోబో టిక్ ఆర్మ్ మరో లొకేషన్‌లో ఫ్రాన్సెన్ చేతిపై పచ్చబొట్టు వేయడం స్టార్ట్ చేసింది. టి-మొబైల్ 5జీ కనెక్షన్ కారణంగా.. థామస్ యాక్షన్‌కు.. రోబో ఆర్మ్ రియాక్షన్‌కు మధ్య ఎలాంటి డిలే కాలేదు. ఏ మాత్రం కనెక్షన్ పోయినా ఈ మొత్తం ఫెయిల్ అయ్యేది. ఈ సమయంలో ఫ్రాన్సెన్‌కు ఎలాంటి హానీ జరగకుండా, ఆమె చేతిపై నీడిల్ లోతుగా దిగకుండా ఓ సెన్సర్‌ను ఏర్పాటు చేశారు. మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. సీట్‌లో కూర్చునే ముందు చాలా నెర్వస్‌గా ఫీలయ్యానని, డిజైన్ పూర్తయ్యాక అలాంటిదేమీ లేదని ఫ్రాన్సెన్ చెప్పింది. తన చేతిపై ఫస్ట్ 5జీ టాటూ పడిందంటూ సంతోషం వ్యక్తం చేసింది. ‘‘టాటూ వేయించుకునే వ్యక్తి మరో మనిషితోనే పచ్చబొట్టు వేయించుకుంటాడు. కానీ ఆ వ్యక్తి దగ్గర ఉండడు. అదే తేడా’’అని టెక్నాలజిస్ట్ డ్రూ చెప్పారు.