వరంగల్, వెలుగు : గ్రేటర్ వరంగల్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఎవరూ ఊహించని రీతిలో ఆరుగురు సిట్టింగ్ కార్పొరేటర్లు, మరో ఐదుగురు మాజీ కార్పొరేటర్లతో పాటు ఉద్యమ కాలం నాటి సీనియర్ లీడర్లు గులాబీ పార్టీని వీడారు. వీళ్లు బుధవారం వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి ఆధ్వర్యంలో గాంధీభవన్‍లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దీప్‍దాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
బీఆర్ఎస్ను వీడిన కార్పొరేటర్లలో వేముల శ్రీనివాస్, చీకటి శారద ఆనంద్, మామిండ్ల రాజు, షర్తాజ్ బేగం, ఎనుగుల మానస రాంప్రసాద్, నెక్కొండ కవిత కిషన్ ఉండగా.. మాజీ కార్పొరేటర్లలో వీరగంటి రవీందర్, స్వామిచరణ్, తాడిశెట్టి విద్యాసాగర్, వేల్పుల మోహన్, గోల్కొండ రాంబాబుతో పాటు సీనియర్ నేతలు సిరిల్ లారెన్స్, సిలివేరు విజయ్ భాస్కర్, నలుబోల సతీష్ ఉన్నారు. వీళ్లందరూ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కాగా, కొన్ని రోజుల కిందనే హనుమకొండ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‍ఖాన్, మాజీ కార్పొరేటర్లు అబూబకర్, సుంచు అశోక్, శామంతుల ఉషాశ్రీ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ లో చేరారు.