
ఓఆర్ఆర్పై సెప్టెంబర్ 4న మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 కార్లు ధ్వంసమయ్యాయి. ప్రత్యక్ష సాక్ష్యుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నార్సింగి ఓఆర్ఆర్ పై వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో దారులన్నీ జలమయమయ్యాయి. ఇదే సమయంలో ఓ కారు నార్సింగి ఓఆర్ఆర్ వద్దకు వచ్చింది. రన్నింగ్‌లో ఉన్న ఆ కారు.... పక్క నుంచి మరో కారు వేగంగా వెళ్లింది.
ఆ వేగం ధాటికి రోడ్డుపై ఉన్న నీరు దాని పక్కనే ఉన్న కారు అద్దంపై పడ్డాయి. కారు డ్రైవర్‌కి ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించకపోవడంతో సడెన్ బ్రేక్ వేశాడు. అదే సమయంలో వెనకే వస్తున్న మరో 5 కార్లు సడెన్ గా బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీ కొన్నాయి.
అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 6 కార్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ప్రమాదంతో ఓఆర్ఆర్పై ట్రాఫిక్ జాం అయింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ని క్లియర్ చేశారు. వర్షాలు పడుతున్నందున వాహనదారులు మితిమీరిన వేగంతో వాహనాలు నడపవద్దని పోలీసులు సూచిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.