ప్రపంచంలోని వివిధ దేశాల చట్టసభలతో పోల్చితే భారత పార్లమెంట్ కొత్త భవనం ఆకృతి, నిర్మాణ శైలి విభిన్నంగా ఉంది. కొత్త పార్లమెంట్ ఎంతో వైవిధ్యాన్ని కలిగి ఉంది. భారత స్వాతంత్య్ర సంగ్రామం ... ఆ తర్వాత ఏర్పడ్డ పార్లమెంట్ భవనం ప్రజాస్వామ్య దేశానికి సాక్షిగా నిలిచింది. అనేక చారిత్రక ఘట్టాలను నమోదు చేసింది. కొత్త పార్లమెంటులో ఆరు ద్వారాలకు సంబంధించి ఆసక్తికర విషయాల్ని చూస్తే.. వావ్ అనుకోవాల్సిందే. ఆరు దర్వాజాలకు పౌరాణిక నేపథ్యం ఉన్న ప్రాణుల పేర్లు పెట్టారు. ఈ గుమ్మాలకు వాటిని కాపలాగా ఉంచిన వైనం.. అందుకురూపొందించిన శిల్పాల్ని చూసినంతనే ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ద్వారాలకు పెట్టిన పేర్లు కూడా ఘనచరిత్రను ప్రతిబింబించేలా ఉన్నాయని చెప్పాలి. వీటికి భారతీయ జానపద కథలు, పురాణాల్లో ప్రాచుర్యం పొందిన జీవుల ఆధారంగా ఆసక్తికరమైన పేర్లు పెట్టారు. జీవుల పేరుకు తగ్గట్లే ప్రతి తలుపును చెక్కారు. ఇవి కేవలం ప్రవేశ ద్వారాలు మాత్రమే కాకుండా కళాత్మక కళాఖండాలుగా నిలుస్తాయి. ఈ ఆరు ప్రత్యేక గేట్ల వివరాలు, విశేషాలు, ప్రత్యేకతలు తెలుసుకుందాం...
1. గజ ద్వారం: పార్లమెంటు భవనం ఉత్తరం వైపున గజ ద్వారం ఉంది. దీనికి ఏనుగు పేరు పెట్టారు. ఏనుగులను తెలివి, జ్ఞాపకశక్తి, సంపద, జ్ఞానానికి ప్రతీకలుగా భావిస్తారు. వినాయక చవితి సందర్భంగా నూతన భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. హిందూ పురాణాల ప్రకారం.. ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టే ముందు గణేష పూజతో మొదలు పెడితే అన్నీ శుభాలు జరుగుతాయని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరం.. బుధగ్రహంతో సంబంధం ఉందని.. ఇది తెలివికి మూలమని విశ్వసిస్తారు.
Also Read : ఎంపీ రమేష్ బిధూరికి బీజేపీ షోకాజ్ నోటీసులు
2. అశ్వ ద్వారం : పార్లమెంటు భవనం తూర్పు కారిడార్‌లో ఈ అశ్వ ద్వారం ఉంటుంది . దీనికి గుర్రం పేరు పెట్టారు.ఆ పేరుపెట్టటమే కాదు.. దీనికి కాపలాగా అందమైన గుర్రం బొమ్మల్ని చెక్కారు. శక్తికి.. బలానికి.. ధైర్యానికి నెలవుగా గుర్రాన్ని చెబుతారు. పాలనలో కావాల్సిన లక్షణాల్ని ఈ ద్వారం గుర్తు చేస్తుందని చెబుతున్నారు. ఒడిశా , కోణార్క్‌లోని సూర్య దేవాలయం ఈ ద్వారానికి స్ఫూర్తి. భారతీయ జానపద కథలలో, గుర్రాలను శక్తి, బలం, ధైర్యానికి చిహ్నంగా సూచిస్తారు.
3. గరుడ ద్వారం : మూడో ద్వారం పేరు గరుడ ద్వారం. కొత్త భవనం తూర్పు వైపు గరుడ ద్వారం ఉంటుంది. పురాణాల్లో గరుడ పక్షికి విశిష్ట నేపథ్యం ఉంది . శ్రీమహా విష్ణువు వాహనమైన గరుడ వాహనం పక్షులకు రాజుగా చెబుతారు. హిందూ త్రిమూర్తులలో సంరక్షకుడు అయిన విష్ణువుతో దానికి అనుబంధం ఉంది. గరుడను శక్తి, ధర్మం (కర్తవ్యం)నికి చిహ్నంగా భావిస్తారు. ఇది అనేక దేశాల చిహ్నాలపై ఎందుకు ఉపయోగించారో కూడా వివరణ ఉంటుంది. హిందూ తత్వశాస్త్రంలో ధర్మ మార్గమైన ధర్మానికి శక్తి, కట్టుబడి ఉండటాన్ని ఇది సూచిస్తుంది.
4. మకర ద్వారం: పశ్చిమంగా పబ్లిక్ ఎంట్రన్స్‌లో ఏర్పాటు చేసిన మకర ద్వారాన్ని కర్ణాటకలోని హళేబీడులో ఉన్న, యునెస్కో గుర్తింపు పొందిన హొయసలేశ్వర ఆలయం ప్రేరణగా రూపొందించారు. మకరం అనేది భిన్నత్వంలో ఏకత్వానికి, అన్ని మతాల ప్రజల మధ్య శాంతియుత సహజీవనానికి చిహ్నం. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. మకరం వివిధ జీవుల కలయికగా పేర్కొంటారు. దక్షిణ, ఆగ్నేయాసియాలో విస్తరించి ఉన్న హిందూ, బౌద్ధ స్మారక కట్టడాలలో మకరం సాధారణంగా కనిపిస్తుంది.. గుమ్మాల వద్ద మకర శిల్పాలు రక్షకులుగా కనిపిస్తాయి. మకర ద్వారం పాత పార్లమెంట్ భవనం ప్రవేశ ద్వారం వైపు ఉంది.
5. శార్దూల ద్వారం : ఐదో ద్వారం శార్దూలం పేరుతో ఏర్పాటు చేవారు. దేశ ప్రజల శక్తిని సూచించేలా దీన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంటులోని ఆగ్నేయంలో శార్దూల ద్వారం ఉంది. ఇది ప్రజా ప్రవేశ ద్వారం. శార్దూలం అంటే సింహం, పులి హైబ్రిడ్ రూపం. ఇది బలం, దయ సంపూర్ణ సమతుల్యతను సూచిస్తుంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని గుజారి మహల్ మ్యూజియంలో భద్రపరచిన రాతి విగ్రహం స్ఫూర్తితో దీన్ని రూపొందించారు. కొత్త పార్లమెంట్ భవనం గేటుపై శార్దూల ఉండటం దేశ ప్రజల శక్తిని సూచిస్తుందని ప్రభుత్వం నోట్ పేర్కొంది.
6. హంస ద్వారం:ఆరో ద్వారానికి హంస ద్వారమని పేరు పెట్టారు. భవంతికి ఈశాన్యంలో, కర్ణాటక హంపిలో ఉన్న విజయ్ విఠ్ఠల దేవాలయం స్ఫూర్తితో రూపొందించిన హంస ద్వారం ఉంది. హంస అనేది హిందూ జ్ఞాన దేవత అయిన సరస్వతి వాహనం. వివేచన, స్వీయ-సాక్షాత్కారం, జ్ఞానానికి ప్రతీకగా హంసను చూస్తారు. హంస మోక్షానికి నెలవుగా చెబుతారు. జనన.. మరణ చక్రం నుంచి ఆత్మ విముక్తిని సూచన చేసే హంసను ఆరో ద్వారంగా ఏర్పాటు చేశారు.