బిజినెస్‌డెస్క్, వెలుగు: ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెతుంటుంది. పెళ్లి సంగతేమో గాని ఇల్లు కట్టడం అంత సులభం కాదు. ప్లాట్(ల్యాండ్)ను కొనడం ఒకెత్తయితే దానిలో కన్‌స్ట్రక్షన్ పూర్తి చేయడం ఖర్చుతో కూడుకున్నదే. కానీ చిన్న చిన్న విధానాలను ఫాలో కావడం వలన ఈ ఖర్చులను సుమారు 12–15 శాతం వరకు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక చదరపు అడుగు నిర్మాణానికి సగటును రూ. 1,500 అవుతుంది. లగ్జరీగా ఉండాలనుకుంటే రూ. 2,000 వరకు ఖర్చు అవ్వొచ్చు. చౌకగా ఉండాలనుకుంటే ఒక చదరపు అడుగుని రూ. 1,200 కే పూర్తి చేయొచ్చు. అంటే 2,000 చదరపు అడుగులలో ఇల్లు కట్టడానికి సగటున రూ. 30 లక్షలు ఖర్చయిపోతుంది. ఇందులో 12–15 శాతం అంటే రూ. 3. 6 లక్షల నుంచి రూ. 4.5 లక్షల వరకు ఉంది. సరియైన విధానాలను ఫాలో అయితే సుమారు రూ. 4.5 లక్షల వరకు ఖర్చు సేవ్ చేసుకోవచ్చని నిపుణులు సలహాయిస్తున్నారు.
ఇల్లు కట్టేముందు ఈ ఆరు ఫాలో అవ్వండి..
1 సరియైన ప్లాట్‌ను ఎన్నుకోవడం
రోడ్ లెవెల్‌లో చదునుగా ఉన్న ప్లాట్‌ను ఎన్నుకోవడం మంచిది. చదునుగా లేకపోతే ప్లాట్‌ను లెవెల్ చేయడానికి అదనపు మెటీరియల్స్‌ను లేదా ఎక్విప్‌మెంట్లను వాడాల్సి ఉంటుంది. దీని వలన కన్‌స్ట్రక్షన్ ఖర్చులు పెరుగుతాయి.
2 స్టాండర్డ్ డిజైన్
కొత్త కొత్త డిజైన్లలో ఇంటిని కట్టాలని ఆలోచిస్తాం. కానీ స్టాండర్డ్ డిజైన్‌లో కట్టడం వలన డబ్బులు సేవ్ అవుతాయి. సాధారణంగా కట్టే ఇళ్ల నిర్మాణంలో స్టెబిలిటీ ఉంటుంది. కొత్త డిజైన్లతో కడితే ఇల్లు స్టేబుల్‌గా ఉండడానికి అదనంగా రీఇన్‌ఫోర్స్డ్ కాంక్రీట్‌ను వాడాల్సి ఉంటుంది. దీనికి అదనపు ఖర్చు అవుతుంది.
3 లోకల్ మెటీరియల్స్.. బల్క్‌గా
సిమెంట్, ఇటుకలు, బ్లాక్‌లు, డోర్లు, విండోలు, టైల్స్, బాత్‌రూమ్ ఫిట్టింగ్‌లు, పైపులను లోకల్‌గానే బల్క్ మొత్తంలో కొనడం వలన డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
4 కొత్త టెక్నాలజీ వాడడం..
ఇండస్ట్రియల్ కన్‌స్ట్రక్షన్‌లో ప్రీ ఇంజినీర్డ్ బిల్డింగ్స్(పీఈబీ)ను వాడుతుంటారు. తాజాగా రెసిడెన్సియల్ నిర్మాణంలో కూడా వీటి వాడకం పెరిగింది. పీఈబీలో స్టీల్ స్ట్రక్చర్‌లు, ఫ్లోరింగ్, గోడలను సిమెంట్, జిప్సమ్ బోర్డులతో కడతారు. ఈ విధానంలో తొందరగా ఇంటి నిర్మాణం పూర్తవ్వడంతో పాటు ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది.
5 ఎన్నేళ్లు మన్నుతుందో..
తక్కువ ఖర్చులో పూర్తయ్యే ఇళ్లకు, తక్కువ క్వాలిటీ ఇళ్లకు మధ్య తేడాని గమనించాలని నిపుణులు అన్నారు. 30–50 ఏళ్లు వచ్చేలా ఇళ్లను కట్టుకోవాలని, ఆర్కిటెక్చర్ సాయంతో ఎక్కువ కాలం వచ్చే, అదే టైమ్‌లో ధర మరీ ఎక్కువ కాని మెటీరియల్స్‌ను ఎంచుకోవాలని సలహాయిస్తున్నారు.
6 సరియైన ఆర్కిటెక్చర్, కాంట్రాక్టర్ అవసరం..
క్వాలిటీ ఆర్కిటెక్చర్‌ను నియమించుకోవడానికి ఎక్కువ ఖర్చవుతుంది. అయినప్పటికీ కన్‌స్ట్రక్షన్ ఖర్చులు తగ్గడంలో ఆర్కిటెక్చర్ పాత్ర కీలకమని నిపుణులు చెబుతున్నారు. అదే ఊళ్లల్లో అయితే పనితెలిసిన మేస్త్రీలను నియమించుకోవడం ఉత్తమం. క్వాలిటీ ఆర్కిటెక్చర్ అందుబాటులో ఉన్న స్థలాన్ని 100 శాతం వాడుకోవడమే కాకుండా, కన్‌స్ట్రక్షన్ ఖర్చులు తగ్గిస్తాడు. ఎక్కువ సంఖ్యలో గోడలను షేర్ చేసుకుంటే స్పేస్ మెరుగుపడడమే కాకుండా, కార్పెట్ ఏరియా పెరుగుతుందని ఓ కాంట్రాక్టర్ చెప్పారు. కాగా, బయట గోడలను విడిచిపెడితే లోపల ఉన్న ఏరియాను కార్పెట్ ఏరియా అంటారు. కన్‌స్ట్రక్షన్ ఆలస్యం కావడంతో ఎక్కువగా నిర్మాణ ఖర్చులు పెరుగుతాయి. అందువలన క్వాలిటీ కాంట్రాక్టర్‌ను ఎన్నుకుంటే డెడ్‌లైన్‌లోపు కన్‌స్ట్రక్షన్‌ను పూర్తి చేయొచ్చు. ఎలాంటి ఇల్లు కట్టాలనుకుంటున్నారో దానికి పోలికగా ఉన్న ఇల్లును పరిశీలించి ఆర్కిటెక్చర్, కాంట్రాక్టర్‌ను ఎన్నుకోవడం ఉత్తమం. వీరిని ఎన్నుకున్న తర్వాత ఇరువురి ప్రయోజనం కలిగేలా అగ్రిమెంట్‌ను రాసుకోవాలి. అంటే ఫీజులు ఎంత, మెటీరియల్స్ ఎవరు తెస్తారు, ఎప్పటిలోపు వర్క్ పూర్తవుతుంది, లేటయితే పెనాల్టీ వేయడం వంటి అంశాలను ఈ అగ్రిమెంట్‌లో పొందుపర్చాలి. ఇంటి నిర్మాణం పూర్తయి చేతికొచ్చేంత వరకు ఎటువంటి పేమెంట్లు చేయకపోవడం మంచిది. ఫీజులో చెల్లించకుండా ఆపిన అమౌంట్‌ను 3–6 నెలల వరకు పే చేయకుండా ఉండండి.