రేషన్ కార్డులోని ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఫ్రీ: మంత్రి ఉత్తమ్

ఖమ్మం: రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం (జనవరి 13) రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల జారీ కార్యక్రమాల అమలుపై  ఖమ్మం కలెక్టరేట్‎లోఉప ముఖ్యమంత్రి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితీశ్ వి. పాటిల్‎లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. నూతన రేషన్ కార్డుల జారీ అంశంలో అధికారులు మానవీయ దృక్పథంతో పని చేయాలని సూచించారు.

ALSO READ | Indiramma Model House: ఇందిరమ్మ ఇల్లు మోడల్.. హాల్, బెడ్ రూం, కిచెన్ , హాల్, ముందు వరండా..అటాచ్డ్ బాత్రూం..

ప్రతి సంవత్సరం సన్న బియ్యం మీద 11 నుంచి 12 వేల కోట్ల ఖర్చు చేయబోతున్నా మని తెలిపారు. నూతన రేషన్ కార్డుల జారీ, కార్డులలో నూతన సభ్యుల నమోదు వివరాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అన్నారు. అలాగే.. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో 3500 ఇండ్లు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడతలో పంపిణీ చేయనున్నామని చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి 12 వేలు అందిస్తామని, మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఆహారభద్రత చట్టాన్ని దేశంలో ప్రవేశ పెట్టామని గుర్తు చేశారు. 

రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల జారీ కార్యక్రమాలు 2025, జనవరి 26 నుండి ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రాంతంలో భారీగా నిధులు ఖర్చు చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని, ఈ అంశాన్ని ప్రజల దృష్టికి అధికారులు ప్రజాప్రతినిధులు తీసుకుని వెళ్లాలని పిలుపునిచ్చారు.