
- కొత్త కేబినెట్‌లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు దక్కని చోటు
- విస్తరణలో ఈ జిల్లాల లీడర్లకే ఎక్కువ అవకాశాలు
హైదరాబాద్, వెలుగు : కొత్తగా కొలువుదీరిన రాష్ట్ర కేబినెట్‌లో మరో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఎవరితో భర్తీ చేస్తారన్న చర్చ మొదలైంది. వాస్తవంగా రాష్ట్ర కేబినెట్‌లో ముఖ్యమంత్రి, 17 మంది మంత్రులు ఉండాలి. గురువారం ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డితోపాటు మరో 11 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఇంకో ఆరు మినిస్టర్ పదవులు ఖాళీగా ఉన్నాయి.
వీటి కోసం 15 మంది ఎమ్మెల్యేలు, నేతలు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం మంత్రులుగా ప్రమాణం చేసిన వాళ్లలో ఉమ్మడి ఖమ్మం నుంచి అత్యధికంగా ముగ్గురికి చోటు దక్కింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి సీఎంగా రేవంత్‌రెడ్డి, మంత్రిగా జూపల్లి కృష్ణారావుకు అవకాశం దక్కింది.
ఉమ్మడి నల్గొండ నుంచి ఇద్దరు, ఉమ్మడి కరీంనగర్ నుంచి ఇద్దరు, ఉమ్మడి వరంగల్ నుంచి ఇద్దరికి చాన్స్ వచ్చింది. ఉమ్మడి మెదక్ నుంచి దామోదర రాజనర్సింహకు చోటు దక్కింది.
విస్తరణలో 4 జిల్లాల వాళ్లకే ఎక్కువ చాన్స్
ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి నుంచి ప్రస్తుత కేబినెట్‌లో ఎవరికీ అవకాశం దక్కలేదు. దీంతో కేబినెట్ విస్తరణలో ఈ జిల్లాల నాయకులకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే, 4 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఇందులో వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ను అసెంబ్లీ స్పీకర్‌గా ప్రకటించారు. ఇంకా ఈ జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్‌మోహన్‌రెడ్డి మంత్రి వర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. రంగారెడ్డి నుంచే ఒకరికి స్పీకర్ పోస్టు ఇవ్వడం, మంత్రివర్గంలో ఇప్పటికే నలుగురు రెడ్లు ఉండడంతో ఈ ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే మంత్రి అయ్యే అవకాశం ఉందని సీనియర్లు లీడర్లు చెప్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో పది అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ 4 సీట్లలో గెలిచింది. ఈ జిల్లాలో ఒకరు లేదా ఇద్దరికి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉండగా.. ముగ్గురు సీనియర్ లీడర్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్‌రావు లైన్‌లో ఉన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే, ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా మంత్రి పదవి ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ షబ్బీర్ విజయం సాధించలేకపోయారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మైనార్టీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కామారెడ్డి సీటును రేవంత్ కోసం త్యాగం చేయడం వంటివి షబ్బీర్‌కు కలిసొచ్చే అంశాలుగా పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఒకవేళ షబ్బీర్‌కు మంత్రి పదవి ఇస్తే.. నిజామాబాద్ నుంచి ఒక్కరికి చోటు దక్కే చాన్స్ ఉంటుంది.
ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లు ఉంటే, ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవలేదు. రాష్ట్ర రాజధాని కావడంతో ఇక్కడి నుంచి కనీసం ఒకరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఆ ఒక్క సీటు కోసం ఫిరోజ్ ఖాన్, అంజన్‌కుమార్ యాదవ్, మధు యాష్కిగౌడ్, మైనంపల్లి హన్మంతరావు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. వీళ్లు పోటీ చేసినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయారు. మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీని మంత్రి వర్గంలోకి తీసుకుంటే, ఫిరోజ్ ఖాన్‌కు బెర్తు దక్కకపోవచ్చని పార్టీ నేతలు అంటున్నారు.
ప్రస్తుతం మంత్రి వర్గంలో బీసీలు పొన్నం ప్రభాకర్‌గౌడ్, కొండా సురేఖ(పద్మశాలి) ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో బీసీకి మంత్రి వర్గంలో చోటు ఇవ్వాల్సి ఉంది. ఈ కోటాలో అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కిగౌడ్‌కు అవకాశం ఉంది. ఈ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా హైదరాబాద్ జిల్లా కోటాతో పాటు, బీసీ కోటా లెక్క కూడా కలిసొస్తుందని పార్టీ నేతలు చెప్తున్నారు.
బీసీ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (కుర్మ) కూడా బెర్తు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదే కోటాలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(రజక)ను తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్నది.