వెలుగు, నెట్వర్క్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. మొదటి రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా6 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలు ఉండగా, మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మహ్మద్ ఇంతియాజ్ అహ్మద్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
మిగతా రెండు నియోజకవర్గాల నుంచి నామినేషన్లు వేయలేదు. నారాయణపేటలోని మక్తల్, నారాయణపేట అసెంబ్లీ సెగ్మెంట్లకు తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలు ఉండగా, అలంపూర్ ఎస్సీ నియోజకవర్గం నుంచి ప్రేమలత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ చంద్రకళకు అందజేశారు. గద్వాల నియోజకవర్గానికి నామినేషన్లు రాలేదని రిటర్నింగ్ ఆఫీసర్ అపూర్వ్ చౌహాన్ తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 3 నామినేషన్లు దాఖలయ్యాయి.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి,కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తరపున ఆయన భార్య బీరం విజయ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను కొల్లాపూర్ రిటర్నింగ్ ఆఫీసర్ కుమార్ దీపక్‌కు అందజేశారు. నాగర్ కర్నూల్ నుంచి సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ నుంచి కె.శంకర్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట్ రెడ్డికి అందజేశారు. కల్వకుర్తి నుంచి బాదేపల్లి రాజు గౌడ్ ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు.