బెంగళూరులో భయానక ఘటన వెలుగు చూసింది. 6 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఓ ప్రబుద్ధుడు, ఆపై చిన్నారిని అత్యంత పాశవికంగా హత మార్చాడు. బాలిక గొంతుపై కాలితో తొక్కి పట్టి ఊపిరి ఆడనివ్వకుండా ప్రాణాలు తీశాడు. ఈ ఘటన నగరంలోని హొయసల నగర్‌లో వెలుగు చూసింది.
బాలికపై అత్యాచారం, హత్య చేసిన కేసులో అభిషేక్ కుమార్ అనే వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసినట్లు బెంగుళూరు పోలీసులు తెలిపారు. నిందితుడిని బిహార్‌కు చెందిన వాడిగా తేల్చారు. ఇతడు భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. బాధితురాలు కూడా ఓ దినసరి కూలీ కూతురే. తల్లిదండ్రులు లేని సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనకు పూర్తి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఘటనకు సంబంధించి కొన్ని కీలకమైన ప్రాథమిక ఆధారాలు లభించాయని, వాటి ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 323, 324, 376, 307, (POCSO) యాక్ట్ 2012లోని సెక్షన్లు 4, 6 కింద కేసులు నమోదు చేశారు.