
- ఆడుకుంటూ వెళ్లి చెరువులో పడినట్లు గుర్తింపు
- రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లో ఘటన
దిల్ సుఖ్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ చెరువులో చిన్నారి చనిపోయింది. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన పాలకుర్తి శ్రీను, శ్రావణి దంపతులు బతుకుదెరువు కోసం సిటీకి వచ్చారు. సరూర్ నగర్ చెరువు కట్టకు ఆనుకుని ఉన్న గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నంబర్14లో రేకుల షెడ్లో ఉంటున్నారు. వీరికి నలుగురు ఆడపిల్లలు. సోమవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో శ్రీను, శ్రావణి పక్కింటివారితో మాట్లాడుతుండగా, వీరి రెండో కూతురు అభిత(6) చెట్టు కింద ఆడుకుంటోంది.
కొద్దిసేపటి తర్వాత కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం 9:30 గంటల సమయంలో అభిత డెడ్ బాడీ సరూర్ నగర్ చెరువులో నీటిపై తేలుతూ కనిపించింది. కుటుంబ సభ్యులు చూసి వెళ్లి బయటకు తీశారు. సమాచారం అందడంతో సరూర్ నగర్ పోలీసులు వెళ్లి కేసు నమోదు చేసి పాప డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. చిన్నారి ఆడుకుంటూ వెళ్లి చెరువులో పడినట్లు భావించారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని గ్రీన్ పార్క్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.