
- రూ. 2,648 కోట్లు కొల్లగొట్టినట్లుప్రాథమిక నిర్ధారణ
- ఎగవేతలకు గత సర్కార్లోని కొందరు పెద్దలు, అధికారుల సహకారం
- నిరుడు మాజీ సీఎస్ సోమేశ్ మీద కేసుతో వెలుగులోకి!
- అసలు సూత్రధారులను తేల్చే పనిలో రాష్ట్ర ప్రభుత్వం
- ఫోరెన్సిక్ ఆడిట్ వివరాల ఆధారంగా లెక్కలు తేలుస్తున్న హై లెవెల్ కమిటీ
- లిస్టులో ఐదు ప్రభుత్వ ఏజెన్సీలు కూడా..!
- పక్కా ఆధారాలతో ఫైనల్ రిపోర్ట్ రాగానే క్రిమినల్ చర్యలు
- ఆయా కంపెనీల నుంచి సొమ్ము రికవరీ చేసే యోచన
హైదరాబాద్, వెలుగు:
రాష్ట్రంలో జీఎస్టీ అక్రమాలకు దాదాపు 75 కంపెనీలు పాల్పడ్డట్టు తేలింది. ఇందులో 60 దాకా బడా కంపెనీలే ఉన్నట్లు వెల్లడైంది. గత సర్కార్‌లో ప్రభుత్వ పెద్దలను, అధికారులను మేనేజ్ చేసి.. ఆయా కంపెనీలు ఏకంగా రూ. 2,648 కోట్లు కొల్లగొట్టి, ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. జీఎస్టీ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్‌లోని వివరాలతో హైలెవెల్ కమిటీ ఎంక్వైరీ చేస్తున్నది. ఇందులో కంపెనీల బాగోతం ఒక్కొక్కటి బయటకు వస్తున్నది. కేవలం 30 కంపెనీలకు సంబంధించి తనిఖీ చేపట్టి, ఆడిట్ చేయగా.. రూ.1,757 కోట్ల జీఎస్టీ అక్రమాలు జరిగినట్లు తేలిందని సెక్రటేరియెట్‌లోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
త్వరలో పూర్తి స్థాయి నివేదిక
జీఎస్టీ అక్రమాలకు పాల్పడ్డ 75 కంపెనీల్లో ఇప్పుడు 70 మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. మరో ఐదు ఇన్‌యాక్టివ్ కాగా.. ఇందులోనూ మూడు ఎలాంటి టర్నోవర్ లేకుండా ఉన్నాయి. ప్రభుత్వానికి జీఎస్టీ నష్టం కలిగించిన దాంట్లో ఐదు ప్రభుత్వ ఏజెన్సీలు కూడా ఉన్నట్లు తెలిసింది. 75 కంపెనీల్లో పెద్ద తలలు ఉండటం, ప్రభుత్వ ఏజెన్సీలు కూడా ఉండటంతో వాటి అక్రమాలకు సహకరించిన అసలు సూత్రధారులు ఎవరనేది ప్రభుత్వం తేల్చే పనిలో ఉన్నది. ఒక్కో కంపెనీ అక్రమాలపై ఎక్కడా భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా పక్కా ఆధారాలను హైలెవెల్ కమిటీ సేకరిస్తున్నది. వాటి ఆధారంగా కింగ్ పిన్స్‌ను గుర్తించి, క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
అవసరమైతే ఆయా కంపెనీల నుంచి మొత్తం సొమ్మును రికవరీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నిరుడు మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ మీద కేసు నమోదు చేశారు. 11 ప్రైవేటు సంస్థలు సుమారు రూ. 400 కోట్లు ఎగవేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘స్పెషల్ ఇనీషియేటివ్స్’ పేరిట ఏర్పాటైన వాట్సప్ గ్రూప్ లో జరిగిన చాట్స్‌పై ఫోరెన్సిక్ ఆడిట్‌కు ప్రభుత్వం నుంచి లెటర్ వెళ్లింది. ఎవరెవరికి ఏ మేరకు లబ్ధి జరిగింది? ఇంకా ఏమైనా అక్రమాలు జరిగాయా? అనే దానిపైనా ఫోరెన్సిక్ ఆడిట్లో వివరాలు వచ్చాయి. ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి? అసలు లబ్ధి ఎవరికి జరిగిందనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ హైలెవెల్ ఇన్వెస్టిగేటివ్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ అన్నింటిని పరిశీలిస్తూ.. ఆయా కంపెనీలకు సంబంధించి పూర్తి అక్రమాలు బయటకు తీసేందుకు ఒక్కో అధికారికి ప్రత్యేక టాస్క్‌లను అప్పగించింది. ఈ క్రమంలోనే ఆధారాలు సేకరిస్తున్న అధికారులు.. ఊహించిన దానికంటే ఎక్కువగా జీఎస్టీ అక్రమాలు జరిగిన తీరు చూసి నివ్వెరపోతున్నారు. అయితే అంతకు ముందు కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌గా ఉన్న ఉన్నతాధికారి హైలెవెల్ కమిటీకి పూర్తిస్థాయిలో సహకరించలేదని తెలిసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందించగా.. అనుమానం ఉండి, అక్రమాలు జరిగినట్లు భావిస్తున్న అన్ని కంపెనీల జీఎస్టీ వ్యవహారాలపై పూర్తిస్థాయి ఆడిట్ చేయాలని సర్కార్ ఆదేశించింది. ఇందుకు అథరైజేషన్ ఇచ్చినట్లు తెలిసింది.
లిస్టులో ఫార్మా, ఇరిగేషన్ కంపెనీలు..!
జీఎస్టీ పన్నులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ తయారీలోని లోపాలను ఆసరాగా చేసుకొని..
ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పేరుతో కంపెనీలు అక్రమాలకు పాల్పడ్డాయి. ఇందుకు గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే.. అక్రమాలకు పాల్పడ్డ 75 కంపెనీల్లో కొన్ని వాటి జీఎస్టీ ఐఎన్ నంబర్లను రద్దు చేసుకున్నాయి. ఎక్కువగా కన్స్ట్రక్షన్ కంపెనీలు ఈ వ్యవహారంలో ఉన్నట్లు సమాచారం.
లిస్ట్‌లో ఫార్మా కంపెనీలతో పాటు హోటల్స్, షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించే.. ఒక పెద్ద కంపెనీ సైతం అక్రమాలకు పాల్పడ్డట్టు అధికారులు చెప్తున్నారు. ఆ కంపెనీ ఏపీలో బడా ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఇప్పటికే జీఎస్టీ ఎగవేత దాంట్లో జీఎంఆర్ (హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్), జియో ఫైబర్ లిమిటెడ్, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్, మాంగళ్య షాపింగ్ మాల్, ఎల్ అండ్ టీ , ఐటీసీ లిమిటెడ్ వంటి కంపెనీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటితోపాటు మిగతా కంపెనీల బాగోతాన్ని కూడా పక్కా ఆధారాలతో రాబడుతున్నారు.