విజృంభిస్తున్న జ్వరాలు..కామారెడ్డి జిల్లాలో 60 డెంగ్యూ కేసులు.. నలుగురి మృతి

  • 15 రోజుల్లో జ్వరాలతో కామారెడ్డి జిల్లాలో నలుగురి మృతి
  • ఈ నెలలో  60 వరకు డెంగ్యూ కేసులు

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. 15 రోజుల వ్యవధిలోనే  నలుగురు చనిపోయారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.  పదుల సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి.  వందల మంది జ్వరాలతో  బాధపడుతున్నారు.  వాతావరణ పరిస్థితులు,  శానిటేషన్​ లోపంతో   జిల్లాలో సీజనల్​ జ్వరాలు ప్రబలుతున్నాయి.  డెంగీ, మలేరియా, టైఫాయిడ్​, చికెన్​ గున్యా వంటి లక్షణాలతో  ఎక్కువ మంది  బాధపడుతున్నారు.   దోమల వ్యాప్తితో  జ్వరాలు వస్తున్నాయి.   

అయినప్పటికీ దోమల నివారణకు క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు. కామారెడ్డి, మాచారెడ్డి, లింగంపేట, నిజాంసాగర్​,  పాల్వంచ,  సదాశివనగర్​, తాడ్వాయి,  గాంధారి, ఎల్లారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, బీబీపేట మండలాల్లో జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి.  తండాలు, గ్రామాల్లో పదుల సంఖ్యతో విష జ్వరాల బారిన పడుతున్నారు.  ఎక్కువ మంది బాధితులు ప్రైవేట్​ హాస్పిటల్​లో ట్రీట్మెంట్​ తీసుకుంటున్నారు.  ఇదే అదునుగా భావించి ప్రైవేట్​లో ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారు.   డెంగ్యూ వచ్చిన వారికి రూ. 30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు అవుతుంది. 

 పరిస్థితి ఇది...

జిల్లాలో ఇప్పటి వరకు 110 డెంగ్యూ  కేసులు నమోదయ్యాయి.  ఇందులో జులై, ఆగస్టు నెలలోనే 100  ఉన్నాయి.  ఇవి కాకుండా  ఇంకా  ప్రైవేట్​ హాస్పిటల్స్​లో కూడా  పదుల సంఖ్యలో డెంగ్యూ  కేసులు నమోదవుతున్నాయి.  ఈ వివరాలను హెల్త్ డిపార్ట్​మెంట్​ సేకరించట్లేదు.  మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లిలో 9 మందికి,  నిజాంసాగర్​ మండలం వడ్డేపల్లిలో 1‌‌‌‌‌‌రోజు వ్యవధిలో 9 మందికి డెంగీ నిర్ధారణ అయ్యింది.  ఆయా పీహెచ్​సీల పరిధిలో  డెంగ్యూ కేసులు నమోదవుతునే ఉన్నాయి.   జిల్లాలోని పలు గ్రామాలు, తండాల్లో బాధపడుతున్నారు. 

దోమల వ్యాప్తితో

డెంగీ కేసులు, జ్వర బాధితుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ దోమల నివారణకు తగిన చర్యలు చేపట్టడం లేదు.  ప్రధానంగా పంచాయతీల్లో ఫండ్స్​ కొరత వేధిస్తోంది.  ఎక్కడైనా డెంగీ కేసుల సంఖ్య ఎక్కువగా వస్తే  ఒకటి, రెండు రోజులు హెల్త్​, పంచాయతీ ఆఫీసర్లు హడావిడి చేసి మళ్లీ పట్టించుకోవట్లేదనే విమర్శలు ఉన్నాయి.  ఇండ్ల మధ్య నీళ్లు నిల్వ ఉండటంతో   అపరిశుభ్రతతో దోమలు పెరుగుతున్నాయి.  కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా  ఇండ్ల మధ్య నీటి నిల్వ ఉంటుంది.  యంత్రాంగం దోమల నివారణకు కట్టడికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

ఏ ఏరియాలో చనిపోయారంటే..

సదాశివనగర్​ మండలం భూంపల్లిలో  10 రోజుల వ్యవధిలో  ఇద్దరు చిన్నారులు చనిపోయారు.   మగ్గం మానశ్రీ ( 12) 2 రోజులుగా జ్వరంతో బాధపడగా స్థానికంగా ట్రీట్మెంట్​ చేయించారు. తగ్గకపోవటంతో  కామారెడ్డిలోని ప్రైవేట్ హాస్పిటల్​, ఇక్కడి నుంచి హైదరాబాద్​కు తరలించారు. జ్వరం తీవ్రంగా ఉండటంతో  పాటు ప్లేటులేట్స్  తగ్గినట్లు చెప్పగా  24న మాన్యశ్రీ చనిపోయింది.   ఇదే ఊరిలో 15 రోజుల క్రితం రంజిత్​ ( 9) జ్వరంతో చనిపోయాడు.  లింగంపేట మండలం బాయంపల్లికి చెందిన బీటెక్​ స్టూడెంట్​ పీరేందర్​ జ్వరంతో  ఈ నెల 21న చనిపోయాడు.  

తీవ్రమైన జ్వరంతో ఉన్న ఇతన్ని  ఫ్యామిలీ మెంబర్స్​ మండల కేంద్రంలోని రెండు ప్రైవేట్ హాస్పిటల్స్​లో చూపించారు.  ఆ తర్వాత  జిల్లా కేంద్రంలోని ప్రైవేట్​ హాస్పిటల్​కు తరలించగా పరిస్థితి సీరియస్​గా మారడంతో  హైదరాబాద్​కు తీసుకెళ్తుండగా మధ్యలో చనిపోయాడు.   10 రోజుల క్రితం తాడ్వాయి మండలం సంగోజివాడిలో  జ్వరంతో ఓ మహిళ చనిపోయింది.   ఈ గ్రామంలో పలువురు జ్వరాల బారిన పడ్డారు.  కొందరు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్​ హాస్పిటల్స్​కు  ట్రీట్మెంట్​కు వెళ్లగా డెంగీగా నిర్ధారించి ట్రీట్మెంట్ చేశారు. 

క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం

వాతావరణ పరిస్థితులతో జ్వరాలు వ్యాపిస్తున్నాయి.  జ్వరాలను నివారించేందుకు  గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ఇంటి పరిసరాలు క్లీన్​గా ఉంచుకోవటం, నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచనలు చేస్తున్నాం.  ఆర్‌‌‌‌ఎంపీలు, పీఎంపీలు ఇష్టారీతిన టెస్టులు చేయవద్దని  చెబుతున్నాం.  జిల్లాలో 3 ఆర్​ఎంపీలు నిర్వహించే క్లినిక్​లను సీజ్​ చేశాం.

- డాక్టర్​ చంద్రశేఖర్​, డీఎంహెచ్​వో, కామారెడ్డి