కొలంబో: శ్రీలంకలో 60 మంది భారతీయులను అరెస్ట్ చేసింది అక్కడి నేర పరిశోధన విభాగం. ఆన్ లైన్ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారంటూ వీరిని అరెస్ట్ చేశారు. కొలంబో శివారు ప్రాంతా లై న మడివేలా, బల్లరముల్లా, నెగోంబో ల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన పోలీసులు అరెస్ట్ చేశారు. వీరినుంచి 135 సెల్ ఫోన్లు, 57 ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు.
సోషల్ మీడియాలో ఇంటరాక్షన్లకోసం డబ్బులు ఇస్తామని వాట్సాప్ గ్రూపులలో ప్రజలను ఆకర్షించి ఆర్థిక నేరాలు చేస్తున్నారు. ఓ బాధితుడు ఇచ్చిన సమాచారంతో శ్రీలంక సీఐడీ పోలీసులు కొలంబోలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి ఆన్ లైన్ ఫ్రాడ్ ముఠాను పట్టుకున్నారు. వీరిలో 60 మంది భారతీయులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నెగొంబోలోని ఓ పెద్ద విలాస వంతమైన ఇంట్లో ఆన్ లైన్ ద్వారా ఆర్థిక నేరాలకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు గుర్తించారు. 13 మంది అనుమానితులను అక్కడే అరెస్ట్ చేశారు. వారినుంచి 57 సెల్ పోన్లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా నెగోంబోతోపాటు దుబాయ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో ఆన్ లైన్ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. బాధితుల్లో స్థానికులు, విదేశీయులు కూడా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఆర్థిక అవకతవకలు, అక్రమ బెట్టింగ్లు, జూదం ద్వారా ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.