
మంచిర్యాల, వెలుగు : హాజీపూర్ మండలం ముల్కల్ల వద్ద శనివారం 60 కిలోల నిషేధిత బీటీ3 పత్తి విత్తనాలను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకొని ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. కాసిపేట మండలం తుంగగూడెంకు చెందిన గుండవేణి రాజశేఖర్(28), ధర్మారావుపేటకు చెందిన ముచ్చెర్ల సంపత్(27) జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి మంచిర్యాల వైపు బైక్పై 2 సంచులతో వస్తుండగా పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారని చెప్పారు.
వీటి విలువ రూ.1.80 లక్షలు ఉంటుందన్నారు. కోరుట్లకు చెందిన షాబుద్దీన్ దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి మంచిర్యాల జిల్లాలోని రైతులకు ఎక్కువ ధరకు అమ్మడానికి తీసుకొస్తున్నారని తెలిపారు. హాజీపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.