ఇప్పుడున్నది 2.8 కోట్ల మందే డబ్ల్యూహెచ్‌వో రిపోర్ట్‌లో వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ టైమ్‌లో వైరస్ సోకిన పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందించడంలో నర్సుల పాత్ర చాలా కీలకం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సుమారు 60 లక్షల మంది నర్సుల కొరత ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) మంగళవారం వెల్లడించింది. కరోనా ట్రీట్ మెంట్ అందిస్తున్న మెడికల్ సిబ్బందిలో నర్సుల సంఖ్య 50 శాతం కంటే ఎక్కువగానే ఉంది. కానీ డబ్ల్యూహెచ్ఓ, నర్సింగ్ నో, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్(ఐసీఎన్) డేటా ప్రకారం ప్రస్తుతం కరోనా ట్రీట్మెంట్కు సరిపడా నర్సులు అందుబాటులో లేరు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2.8 కోట్ల మంది మాత్రమే నర్సులు ఉన్నారని, ఇంకా 60 లక్షల మంది అవసరం ఉందని పేర్కొంది. 2018 వరకూ ఐదేండ్లలో నర్సుల సంఖ్య 47 లక్షలు పెరిగింది. ‘‘హెల్త్ సిస్టంకు నర్సులు వెన్నెముక లాంటి వారు. కరోనా వైరస్‌పై పోరాటంలో నర్సులు ముందుండి సేవ చేస్తున్నారు. ప్రపంచమంతా హెల్దీగా ఉండాలంటే వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు అందించాలి”అని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ గిబ్రేయసెస్ చెప్పారు.
పేద దేశాల్లో ఎక్కువ కొరత
ముఖ్యంగా ఆఫ్రికా, సౌత్ఈస్ట్ ఆసియా, మిడిల్ ఈస్ట్, సౌత్ అమెరికాలోని కొన్ని పేద దేశాల్లో నర్సుల కొరత ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్ఓ రిపోర్టు పేర్కొంది. ఈ దేశాల్లో నర్సింగ్ విద్యను ప్రోత్సహించాలని, వారికి జాబ్స్ కల్పించాలని సూచించింది. నర్సుల సంఖ్య తక్కువగా ఉన్నట్లయితే దాని ప్రభావం కరోనా ట్రీట్‌మెంట్‌పైనా పడుతుందని, దాని వల్ల మరణాల సంఖ్య కూడా పెరుగుతుందని ఐసీఎన్ చీప్ ఎగ్జిక్యూటివ్ హోవర్డ్ కాటన్ చెప్పారు. ఇది ప్రస్తుతం ఉన్న నర్సింగ్ సిబ్బందిపై ఒత్తిడి పెంచుతుందన్నారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ వంద మంది నర్సులు చనిపోయారని, ఒక్క ఇటలీలోనే 23 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇటలీలో 9శాతం మంది, స్పెయిన్‌లో 14 శాతం మంది ఇన్ఫెక్షన్కు గురయ్యారన్నారు. కొన్ని చోట్ల నర్సులు, హెల్త్ కేర్ వర్కర్లపై దాడులు జరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
నర్సులకూ టెస్టులు చేయాలి
హెల్త్ కేర్ వర్కర్లకు కూడా తరచుగా కరోనా టెస్టులు చేయాలని నర్సింగ్నౌకు చెందిన మేరి వాట్కిన్స్ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా సరిపడా నర్సులు లేదని, కానీ, ఫిలిప్పైన్స్, ఇండియా లాంటి దేశాలు ప్రపంచానికి నర్సులను అందిస్తున్నాయని చెప్పారు. ఇదే సమయంలో ఇండియాలో నర్సులకు కొరత ఉందన్నారు. నర్సులంటే ఇప్పటికీ మహిళల పనే అనే భావం ఉందని, ఇది మారాలని, మరింత మంది మేల్ నర్సులను రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నిఫుణులు చెబుతున్నారు.
For More News..