
న్యూఢిల్లీ: ఎంత సేవ్ చేసినా, ఇన్వెస్ట్ చేసినా, ఫ్యూచర్‌కు సరిపోదని సాండ్‌విచ్ జనరేషన్‌కు చెందిన చాలా మంది భావిస్తున్నారు. 34 నుంచి 54 ఏళ్ల మధ్య ఏజ్ ఉన్నవాళ్లను సాండ్‌విచ్ జనరేషన్‌గా పిలుస్తున్నారు. ఒకవైపు తల్లిదండ్రులను చూసుకోవడం, మరోవైపు పిల్లల భవిష్యత్ కోసం కష్టపడడంతో వీరు ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. డబ్బులు ఎప్పుడయిపోతాయనే ఆందోళనలో 50 శాతం మంది ఉన్నారని ఎడెల్వీస్ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వే పేర్కొంది. ఎంత సంపాదించినా చాలదనే భావనలో ఉన్నారని తెలిపింది.
పిల్లలు చదువులు, పెళ్లి, తల్లిదండ్రుల ఆరోగ్యం, కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం వంటి అంశాలపై ఈ జనరేషన్ ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. సాండ్‌విచ్ జనరేషన్‌లో 94 శాతం మంది తాము ఫైనాన్షియల్ ప్లానింగ్‌ను అమలు చేస్తున్నామని తెలిపారు. ఏదో ఒక అవసరం కోసమే ఇన్వెస్ట్ చేస్తున్నామని 72 శాతం మంది వెల్లడించారు. వీరు లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, బ్యాంక్ ఎఫ్‌డీలలో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. 60 శాతం మంది వీటిలో ఏదో ఒక సెగ్మెంట్‌లో ఇన్వెస్ట్ చేశారు.