ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

రెసిడెన్షియల్ స్కూల్‌‌లో కలకలం

కామారెడ్డి, వెలుగు :  కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి  జ్యోతిబా పూలే గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్‌‌లో శుక్రవారం కండ్లకలక కలకలం రేగింది. స్కూల్‌‌లో 320 మంది  ఉండగా 60 మంది అస్వస్థతకు గురయ్యారు. స్టూడెంట్ల అందరికీ కండ్లకు ఇన్ఫెక్షన్​సోకి ఎర్రగా మారి నీళ్లు కారడంతో పాటు కళ్లు వాచి పోయాయి. పిల్లలంతా ఒకే ఆవరణలో ఉండటంతో  ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్​ సోకినట్లు తెలుస్తోంది. స్కూల్​ఏఎన్ఎం ఆఫీసర్లకు సమాచారం ఇవ్వడంతో దోమకొండ అప్తమాలజిస్ట్​ డాక్టర్ లింబాద్రి స్కూల్‌‌లో క్యాంపు ఏర్పాటు చేశారు. స్టూడెంట్లకు కంటి పరీక్షలు చేశారు. మందులు, ఐ డ్రాప్స్​ఇచ్చారు. ఇన్ఫెక్షన్​ సోకిన స్టూడెంట్లను డాక్టర్​సూచనతో మిగతా వారికి దూరంగా ఉంచారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పులతోనే  ఇన్ఫెక్షన్​సోకి ఉంటుందని హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌ వర్గాలు పేర్కొన్నాయి. 

జీపీ కరెంట్ బిల్లులు కట్టలేం..
మండల సభలో సర్పంచ్‌‌ల వెల్లడి
డిచ్‌‌పల్లి, వెలుగు :
గ్రామ పంచాయతీల కరెంట్ బిల్లులను కట్టలేమని మండల సర్పంచ్‌‌లు తెగేసి చెప్పారు. ఫండ్స్ ఇవ్వకుండా బిల్లులు ఎలా కట్టాలని వారు ప్రశ్నించారు. శుక్రవారం డిచ్‌‌పల్లి ఎంపీపీ గద్దె భూమన్న అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. నిజామాబాద్​ రూరల్​ నియోజకవర్గానికి చెందిన 170 మంది సర్పంచ్‌‌లు బిల్లు చెల్లించకూడదని తీర్మానం చేసుకున్నామని మండల సర్పంచ్‌‌ల ఫోరం అధ్యక్షుడు మోహన్‌‌రెడ్డి అన్నారు. 6 నెలలుగా జీపీలకు స్టేట్, సెంట్రల్ ఫండ్స్ రావడంలేదని పేర్కొన్నారు. ఫండ్స్ రాకపోయినా కరెంట్ బిల్లులను జీపీ జనరల్ ఫండ్ నుంచి కట్టాలని కలెక్టర్ సహా ఆఫీసర్లందరు ఒత్తిడి చేయడం సరికాదన్నారు. నవంబర్ నెల నుంచి చెట్లకు ట్యాంకర్‌‌‌‌తో నీళ్లు పోయాలని ఎంపీడీవో  గోపిబాబు సూచించారు. ఇందుకు సంబంధించి నెలకు మూడు సార్లు ట్యాంకర్ పేమెంట్​ వస్తుందని చెప్పారు. ధరణి సంబంధిత సమస్యలు, అంగన్​వాడీ భవన నిర్మాణాలు, చెడిపోయిన కరెంట్​ పోల్స్‌‌ రిప్లేస్​మెంట్, రేషన్ కార్డులు, ఫింఛన్లు తదితర సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. వైస్​ఎంపీపీ శ్యాంరావు, తహసీల్దార్​శ్రీనివాస్ పాల్గొన్నారు.

కార్ల కోసం రోడ్లపై షెడ్లు..
నిజామాబాద్ నగరంలో ఫుట్‌‌ పాత్‌‌లే కాదు రోడ్లను ఆక్రమిస్తున్నా ఆఫీసర్లు చూసీచూడనట్లు ఉంటున్నారు. సిటీలో పలు కాలనీల్లో కొందరు కార్ల కోసం మున్సిపల్ స్థలం, రోడ్డుపై పార్కింగ్ షెడ్ నిర్మించుకుంటున్నారు. దీంతో ఆ రూట్లలో వెళ్లే వాహనదారులు ఇబ్బందు పడుతున్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోయారు.
- వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్‌‌

నగరాభివృద్ధిపై స్పెషల్‌‌ ఫోకస్‌‌ : ఎమ్మెల్యే గణేశ్‌‌ గుప్తా
నిజామాబాద్, వెలుగు:
60 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధిని ఎనిమిది ఏళ్లలో చేసి చూపించామని అర్బన్ ఎమ్మెల్యే గణేశ్‌‌ గుప్తా చెప్పారు. మర్చంట్స్‌ అసోసియేషన్‌లో మార్కెట్ యార్డు కార్మికులతో శుక్రవారం ఎమ్మెల్యే దీపావళి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా 1500 మంది కార్మికులకు బట్టలు పంపిణీ చేసి వారితో కలిసి సహాపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులు తన దృష్ఠికి తెచ్చిన సమస్యల పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డు అభివృద్ధికి  సహకారాన్ని అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటేశం, మర్చంట్ అసోసియేషన్ సభ్యులు లాభిశెట్టి శ్రీనివాస్, కమల్ కిషోర్ ఇనాని, అర్వపల్లి పురుషోత్తం, మాదని శ్రీధర్, బచ్చు పురుషోత్తం, గుమస్తా సంఘం అధ్యక్షుడు ప్యాట వెంకటేశ్, దడ్వాయి సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, హమాలీ సంఘం అధ్యక్షుడు సాయిలు, చాట సంఘం అధ్యక్షుడు యాదగిరి, ముల్లె సంఘం అధ్యక్షుడు షబ్బీర్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు

కేసీఆర్ చిల్లర రాజకీయాలు మానుకో
నిజామాబాద్, వెలుగు :
సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌‌పాల్‌‌ సూర్యనారాయణ హితవుపలికారు. శుక్రవారం బీజేపీ లీడర్లతో కలిసి ఆయన మునుగోడులో ప్రచారం నిర్వహించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని కేసీఆర్‌‌‌‌ ఇప్పడు కొత్త నాటకాలు అడుతున్నాడని మండిపడ్డారు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక కేసీఆర్‌‌‌‌ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన కల్వకుంట్ల ఫ్యామిలీకి ఈ ఉప ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో  ఇందూరు కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, ఎర్రం సుధీర్, నాయకులు గోపిడి వినోద్‌‌రెడ్డి, పంచరెడ్డి శ్రీధర్, బూరుగుల వినోద్, అమందు విజయ్ కృష్ణ, దాత్రిక రమేశ్‌‌, భాస్కర్‌‌‌‌రెడ్డి, విపుల్ రావు,  దినేశ్, సాయి, ముత్యం పాల్గొన్నారు.

బోధన్‌‌లో మున్సిపల్ కార్మికుల ధర్నా
బోధన్, వెలుగు :
కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌‌ చేస్తూ బోధన్ మున్సిపల్ ఆఫీసు ముందు ఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ మేరకు మున్సిపల్ మేనేజర్​  నరేందర్‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఐఎఫ్‌‌టీయూ రాష్ట్ర నాయకుడు బి.మల్లేశ్‌‌​ మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లు,128 మున్సిపాలిటీల్లో 60 వేల మంది కార్మికులు చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో పనిచేసే కంట్రాక్ట్‌‌, అవుట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26 వేలకు పెంచాలని, పీఆర్‌‌‌‌సీ బకాయి చెల్లించాలని, కార్మికులను రెగ్యూలర్ చేయాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్​ కార్మికులు జి.శంకర్, సైదమ్మ, లక్ష్మి, సావిత్రి, శకుంతల,  సాయమ్మ, పరమేశ్వర్, సాయిలు, పోశెట్టి, పోశవ్వ పాల్గొన్నారు. 

కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర
లింగంపేట, వెలుగు :
 వడ్లకు మద్దతు ధర అందించేందుకే ప్రభుత్వం సింగిల్​విండో ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేస్తుందని శెట్పల్లి సంగారెడ్డి విండో సీఈవో అవుసుల శ్రీనివాస్ చెప్పారు. మండలంలోని పోల్కంపేట గ్రామంలో శుక్రవారం వడ్ల కొనుగోలు సెంటర్‌‌‌‌ను సర్పంచ్ మణిగిరి పద్మతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సెంటర్లలో ఏ గ్రేడ్‌‌ ధాన్యానికి రూ.2,060, బీ గ్రేడ్‌‌కు రూ.2,040 చెల్లిస్తున్నట్లు చెప్పారు. రైతులు నాణ్యమైన వడ్లు తేవాలని సూచించారు.  సింగిల్​విండో వైస్ చైర్మన్​ బండారు కిష్టారెడ్డి, డైరెక్టర్లు కవిత, ఆగమయ్య, సత్యనారాయణ, రామదాసు, రాములు, వీడీసీ చైర్మన్​ సిద్దిరాములు, ఏఈవో రమ్య, ఉప సర్పంచ్ రామానుజచారి పాల్గొన్నారు.

కోటగిరిలో...
కోటగిరి, వెలుగు:
కోటగిరి సొసైటీ, ఏఎంసీ పొతంగల్ సొసైటీ, ఎత్తొండ సొసైటీలు, కోటగిరి ఏఎంసీలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కూడా శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్ పటేల్, వైస్ ఎంపీపీ గంగాధర్, టీఆర్‌‌‌‌ఎస్‌‌ నియోజకవర్గ ఇన్‌‌చార్జి పోచారం సురేందర్‌‌‌‌రెడ్డి,  సొసైటీ చైర్మన్లు కూచి సిద్ధు, అశోక్ పటేల్, శాంతేశ్వర్ పటేల్, ఏఎంసీ చైర్మన్ తేల్ల లావణ్య తదితరులు పాల్గొన్నారు. 

దళారులను నమ్మొద్దు
మాక్లూర్, వెలుగు :
రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలోనే అమ్ముకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని మాక్లూర్ పీఏసీఎస్ చైర్మన్‌‌ గోపు లక్ష్మి అన్నారు. శుక్రవారం మాక్లూర్, బోర్గాం(కే), కల్లడి, గుత్పా, రాంచంద్రాపల్లి, ముల్లంగి (బి), బొంకన్ పల్లి, ధర్మోరా, గుంజిలి, కొత్తపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. వెంకటాపూర్, లక్నాపూర్ గ్రామాల్లో ఐకేపి  ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేశారు.

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
పిట్లం, వెలుగు :
గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పెద్దకొడప్‌‌గల్‌‌ ఎంపీపీ ప్రతాప్‌‌రెడ్డి కోరారు. పెద్దకొడప్‌‌గల్‌‌తో పాటు శాంతాపూర్, సీతారాంపల్లి, మాన్యాపూర్లలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌‌ హన్మంత్‌‌రెడ్డి, సర్పంచ్​ తిరుమల్‌‌రెడ్డి, బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్‌‌ మల్లికార్జునప్ప, రైతు సమన్వయ సమితి చైర్మన్‌‌ బస్వరాజు దేశాయి, ఎంపీటీసీ చంద్రకళ, సొసైటీ సీఈవో సందీప్, ఏవో నదీం పాల్గొన్నారు.

ఓటమి భయంతో టీఆర్‌‌‌‌ఎస్‌‌ నాటకాలు
ఆర్మూర్/లింగంపేట, వెలుగు :
మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో టీఆర్ఎస్‌‌ కొత్త నాటకాలకు తెరలేపిందని బీజేపీ లీడర్లు ఆరోపించారు. బీజేపీపై చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను నిరసిస్తూ శుక్రవారం ఆర్మూర్‌‌‌‌లో ఆ పార్టీ లీడర్లు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ జెస్సు అనిల్‌‌కుమార్‌‌‌‌, దళిత మోర్చా కన్వీనర్ నల్ల రాజారాం, టౌన్ ప్రధాన కార్యదర్శి రాజు, నాయకులు భూపేందర్,  ప్రశాంత్,  శ్రీకాంత్, శివ పాల్గొన్నారు. లింగంపేటలో పార్టీ మండల అధ్యక్షుడు దత్తురాం, ప్రధాన కార్యదర్శి రాంచందర్, బొల్లారం సాయులు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

గెస్ట్ లెక్చరర్‌‌‌‌ పోస్టుకు అప్లై చేసుకోండి
మోర్తాడ్, వెలుగు :
మోర్తాడ్ డిగ్రీ కాలేజీలో తెలుగు  గెస్ట్ లెక్చరర్‌‌‌‌ పోస్టు కోసం అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవా లని ప్రిన్సిపాల్ పెద్దన్న తెలిపారు. పీజీలో 55 శాతం మార్కులు కలిగి నెట్, సెట్, పీహెచ్‌‌డీ చేసిన ఎక్స్‌‌ పీరియన్స్ ఉన్న అభ్యర్థులు నవంబర్ 2 వరకు  తమ అప్లికేషన్లను కాలేజీలో సమర్పించాలన్నారు.

మేం సబ్సిడీ బర్లు ఇస్తే.. కేంద్రం పాలపై జీఎస్టీ వేసింది 

నవీపేట్, వెలుగు : సీఎం కేసీఆర్ సబ్సిడీపై బర్లను ఇచ్చి కల్పిస్తే.. కేంద్రంలోని బీజేపీ సర్కారు పాలపై జీఎస్టీ వేసి ప్రజలను దోచుకుంటుందని బోధన్‌‌ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. శుక్రవారం మండలంలోని నిజాంపూర్, లింగపూర్ నిర్వహించిన ‘మన ఊరు.. మన ఎమ్మెల్యే’ ప్రోగ్రామ్‌‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా అన్ని కుల సంఘాలకు భవనాలు మంజూరు చేశారు. కార్యక్రమంలో లింగపూర్, నిజాంపూర్ సర్పంచ్‌‌లు సాయిలు, విజయ రమేశ్‌‌, ఎంపీపీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ హరీశ్‌‌, జడ్పీ వైస్ చైర్మన్ రజితయాదవ్, జడ్పీటీసీ సవిత బుచ్చన్న, డీసీసీబీ డైరెక్టర్ గంగారెడ్డి, ఎంపీటీసీలు కృష్ణమోహన్, సాధన రాజన్న, పార్టీ ప్రెసిడెంట్ నర్సింగ్‌‌రావు, అల్లం రమేశ్‌‌ పాల్గొన్నారు.