
దుబ్బాక, వెలుగు: దుబ్బాకలో అప్పుడప్పుడు వచ్చి పోయే టూరిస్టులకు స్థానం లేదని, దుబ్బాక ఎప్పటికీ బీజేపీ అడ్డా అని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే సమక్షంలో నియోజకవర్గంలోని చేగుంట మండలం పెద్ద శివనూర్ తాండా, అక్భర్పేట-భూంపల్లి మండలం ఎనగుర్తి గ్రామానికి చెందిన 60 మంది బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి బీజేపీ కండువాలను కప్పి ఆహ్యానించారు.
అనంతరం మాట్లాడుతూ.. దేశం కోసం, ధర్మం కోసం ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో, దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో చేరిన వారిలో పెద్ద శివనూర్ తాండాకు చెందిన వార్డు సభ్యులు మాలోతు మోహన్, లింగం తదితరులు ఉన్నారు.