
- ఉత్పత్తి మాత్రం 115 మిలియన్ యూనిట్లు
- వచ్చే మూడు నెలల్లో పీక్కు చేరనున్న డిమాండ్
- యూనిట్‌కు రూ.10 నుంచి రూ.20 దాకా పెట్టి కొనాల్సిన పరిస్థితి
- రూ.3 వేల కోట్ల దాకా అదనపు భారం పడ్తుందని అంచనా
- గత పదేండ్లలో సొంత విద్యుత్ కేంద్రాలను పూర్తి చేయకపోవడంతోనే ఈ దుస్థితి
హైదరాబాద్, వెలుగు: కరెంట్ వినియోగంలో ముందున్న మన రాష్ట్రం.. కరెంట్ఉత్పత్తిలో మాత్రం వెనుకబడిపోయింది. దీంతో బయట ఎక్కువ రేటు పెట్టి కరెంట్ కొనాల్సిన పరిస్థితి నెలకొంది. గత పదేండ్లలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 300 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం పడుతుండగా, అందులో మన దగ్గర ఉత్పత్తి అయ్యేది115 మిలియన్ యూనిట్లు మాత్రమే! మిగిలిన 185 మిలియన్ యూనిట్లు(60 శాతానికి పైగా) ఇతర రాష్ట్రాలు, పవర్ఎక్ఛ్సేంజ్ల నుంచి కొనాల్సి వస్తున్నది. విద్యుత్ డిమాండ్ పెద్దగా లేని సమయాల్లో యూనిట్‌కు రూ.2.50 రేటుతో కరెంట్దొరుకుతున్నప్పటికీ.. డిమాండ్ పీక్స్‌కు చేరే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో యూనిట్‌కు రూ.10 నుంచి రూ.20 దాకా పెట్టి కొనాల్సి వస్తున్నది. దీని వల్ల ఈ మూడు నెలల కాలంలో మన విద్యుత్‌పంపిణీ సంస్థలపై, తద్వారా రాష్ట్రంపై రూ.3వేల కోట్లకుపైగా అదనపు భారం పడనుంది.
డిమాండ్‌కు సరిపడా కరెంట్‌లేదు..
మార్చి రాకముందే రాష్ట్రంలో ఎండలు దంచికొడ్తున్నాయి. ఇటు గృహవినియోగంతో పాటు వ్యవసాయం, పరిశ్రమలకు విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. పోయినేడాది మార్చి 8న అత్యధికంగా 15,623 మెగావాట్ల డిమాండ్నమోదు కాగా, ఈసారి ఫిబ్రవరి10వ తేదీనే 15,998 మెగావాట్ల డిమాండ్ తో గత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఈసారి యాసంగి సాగు విపరీతంగా పెరగడంతో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో డిమాండ్ 17వేల మెగావాట్లకు చేరుకుంటుందని విద్యుత్ శాఖ అంచనా వేస్తున్నది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో 300 మిలియన్‌యూనిట్ల (ఎంయూ) దాకా వినియోగం జరుగుతుండగా, అందులో మన దగ్గర ఉత్పత్తి అయ్యేది కేవలం 115 మిలియన్ యూనిట్లు మాత్రమే. తెలంగాణ జెన్‌కో విద్యుత్కేంద్రాల నుంచి 82ఎంయూలు, సింగరేణి నుంచి 27ఎంయూలు, హైడల్ద్వారా8 ఎంయూలకు అటు ఇటుగా ఉత్పత్తి జరుగుతున్నది. దీంతో సెంట్రల్జనరేటింగ్స్టేషన్ (సీజేఎస్) సహా వివిధ పవర్ఎక్ఛ్సేంజీల నుంచి సుమారు 185 ఎంయూల దాకా కొనాల్సి వస్తున్నది. గురువారం సీజేఎస్నుంచి 153ఎంయూలు, నాన్ కన్వెన్షన్ఎనర్జీ నుంచి 44 ఎంయూల చొప్పున కొని సప్లై చేయాల్సి వచ్చింది.
పదేండ్లలో పెరిగింది 1,880 మెగావాట్లే..
తెలంగాణ ఏర్పడే నాటికి జెన్‌కో విద్యుత్‌ఉత్పత్తి సామర్థ్యం 5,405 మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం 7,285 మెగావాట్లకు చేరింది. అంటే గడిచిన పదేండ్లలో జెన్‌కో సామర్థ్యం కేవలం 1,880 మెగావాట్లు మాత్రమే పెరిగింది. తెలంగాణ వచ్చాక 1,080 మెగావాట్ల కెపాసిటీతో భద్రాద్రి థర్మల్‌ప్లాంట్, 4వేల మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి పవర్ప్లాంట్ల నిర్మాణాన్ని అప్పటి బీఆర్ఎస్ప్రభుత్వం చేపట్టింది. వీటిలో ప్రస్తుతం భద్రాద్రిలోని1,080 మెగావాట్ల థర్మల్ప్లాంట్తో పాటు యాదాద్రిలోని 5 యూనిట్లలో 800 మెగావాట్ల ఒక యూనిట్మాత్రమే పూర్తయింది. దీంతో కొత్తగా కేవలం 1,880 మెగావాట్ల పవర్అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం జెన్‌కో సామర్థ్యం 7,285 మెగావాట్లు కాగా.. డిమాండ్మాత్రం 15వేల మెగావాట్లను దాటుతుండడంతో బయట కొనుగోలు చేయక తప్పడం లేదు.
రాబోయే మూడు నెలల్లో భారమే..
గత డిసెంబర్, జనవరి నెలల్లో ఒక్కో యూనిట్‌కు సరాసరి రూ.2.69 నుంచి రూ.2.89 మధ్య పవర్ఎక్ఛ్సేంజీల నుంచి టీజీ ట్రాన్స్‌కో కరెంట్కొనుగోలు చేసింది. ఇలా డిమాండ్ పెద్దగా లేనప్పుడు యూనిట్‌కు సగటున రూ.2.50కు దొరికే కరెంట్.. డిమాండ్ఎక్కువగా ఉండే రాబోయే మూడు నెలల్లో యూనిట్ రేటు రూ.10 నుంచి రూ.20 దాకా చేరవచ్చని ట్రాన్స్‌కో అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (ఐఈఎక్స్) ద్వారా సౌత్ఇండియన్ స్టేట్స్లో అమ్ముతున్న కరెంట్‌లో 90 శాతానికి పైగా తెలంగాణే కొంటున్నది. ఎండాకాలం మొదలై మిగతా రాష్ట్రాలు కూడా పోటీ పడితే పవర్ఎక్స్ఛేంజీలో ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. ఆయా నెలల్లో విద్యుత్ కొనుగోళ్లపై ఏకంగా ప్రతి నెలా రూ.వెయ్యి కోట్ల చొప్పున రూ.3వేల కోట్ల అదనపు భారం పడ్తుందని అధికారులు చెప్తున్నారు.
జెన్‌కో కెపాసిటీ ఇదీ..
తెలంగాణ ఏర్పడే నాటికి జెన్‌కో
విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం: 5,405 మెగావాట్లు
ప్రస్తుతం జెన్‌కో సామర్థ్యం: 7,285 మెగావాట్లు
పదేండ్లలో పెరిగిన ఉత్పత్తి: 1,880 మెగావాట్లు
పెరిగిన ఉత్పత్తి ఇలా..
ప్లాంట్ కెపాసిటీ ఉత్పత్తి
భద్రాద్రి 1,080 మెగావాట్లు 1,080 మెగావాట్లు యాదాద్రి 4,000 మెగావాట్లు 800 మెగావాట్లు