సొసైటీల ద్వారానే  60 శాతం యూరియా అమ్మకాలు

  • అప్పుగా తీసుకున్న బస్తాల డబ్బు కట్టాల్సిందే
  • కలెక్టర్​రాజీవ్​గాంధీ హన్మంతు

నిజామాబాద్, వెలుగు: యాసంగి సీజన్​కోసం జిల్లాకు వచ్చే యూరియాలో 60 శాతం అమ్మకాలు సింగిల్​విండో సొసైటీల ద్వారానే జరపాలని కలెక్టర్ రాజీవ్​గాంధీ హన్మంతు ఆదేశించారు. 40 శాతం యూరియాను ప్రైవేట్ డీలర్లకు ఇవ్వాలన్నారు. బుధవారం ఆయన తన ఛాంబర్​లో అగ్రికల్చర్​ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. కొన్ని సొసైటీలు మార్క్​ఫెడ్ ​సప్లయ్​చేసే యూరియాను రైతులకు అమ్మడం లేదని, మార్క్​ఫెడ్​కు డబ్బులు జమచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

అప్పుగా ఇచ్చిన యూరియాకు డబ్బులు చెల్లించడం తప్పనిసరన్నారు. పాత బకాయిలపై దృష్టిసారించాలని ఆదేశించారు. డీలర్లకు సరఫరా చేసే యూరియా సేల్స్​ను ఈ–పాస్​లో విధిగా నమోదు చేయించాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే  లైసెన్స్​లు క్యాన్సిల్​ చేయాలన్నారు. సీజన్ ​మొత్తానికి 70 వేల మెట్రిక్​టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 27 మెట్రిక్​ టన్నులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సింగిల్ ​విండోల పరిధిలో సాగవుతున్న పంటల వివరాల ఆధారంగా అమ్మకాలు చేయించాలని కలెక్టర్​ చెప్పారు. అవసరానికి మించి కొనుగోళ్లను ప్రోత్సహించొద్దన్నారు. నకిలీ విత్తనాలు, క్రిమిసంహారక మందులతో రైతులు ఇబ్బందులు పడకుండా తనిఖీలు చేపట్టాలన్నారు. అడిషనల్​కలెక్టర్ ​యాదిరెడ్డి, జిల్లా అగ్రికల్చర్​ఆఫీసర్​ వాజీద్ ​హుస్సేన్, డీసీవో సింహాచలం, మార్క్​ఫెడ్ ​డీఎం రంజిత్​రెడ్డి, ఏవోలు పాల్గొన్నారు.