న్యూఢిల్లీ: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ రైతు సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. ఈ చట్టాలను పార్లమెంట్ లో రద్దు చేసేంత వరకు ఆందోళనలను కొనసాగిస్తామని చెప్పిన అన్నదాతలు.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా నవంబర్ 29న 60 ట్రాక్టర్లపై పార్లమెంట్ కు ర్యాలీగా వెళ్లనున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని మోడీ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు. తమ డిమాండ్లపై జనవరి 26లోగా ప్రభుత్వం చర్చలు జరపాలని.. లేదంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
‘ప్రభుత్వం తెరిచిన రోడ్ల మీద నుంచే రైతుల ట్రాక్టర్లు వెళ్తాయి. మేం రోడ్లను బ్లాక్ చేశామని ఇన్నాళ్లు ఆరోపించారు. మేం రోడ్లను బ్లాక్ చేయలేదు. రహదారులను బ్లాక్ చేయడం మా ఉద్యమ ఉద్దేశం కాదు. ప్రభుత్వంతో మా సమస్యల గురించి మాట్లాడాలనుకున్నాం అంతే. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) విషయంలో సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి. గత ఏడాది కాలంగా కొనసాగుతున్న ఈ ఉద్యమంలో అమరులైన 750 అన్నదాతల కుటుంబాల పూర్తి బాధ్యత కేంద్రానిదే’ అని తికాయత్ పేర్కొన్నారు.