రైతు నిరసనలకు మద్దతుగా 1,000 కి.మీ.లు సైకిల్ తొక్కిన అన్నదాత

రైతు నిరసనలకు మద్దతుగా 1,000 కి.మీ.లు సైకిల్ తొక్కిన అన్నదాత

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రైతులు నిరసనలు చేస్తున్నారు. అన్నదాతల ఆందోళనలకు ప్రముఖ సెలబ్రిటీలు, విపక్షాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల నిరసనలకు బాసటగా నిలిచేందుకు ఓ రైతన్న ఏకంగా వెయ్యి కిలో మీటర్లు సైకిల్ తొక్కుకుంటూ రావడం విశేషం. 60 ఏళ్ల సత్యదేవ్ మాంఝీ అనే రైతన్నది బిహార్‌‌లోని సివాన్.

రైతుల ఆందోళనల్లో పాల్గొనాలని అనుకున్న సత్యదేవ్ బిహార్ నుంచి ఢిల్లీకి ఏకంగా 1,000 కిలో మీటర్లు సైకిల్ నడుపుకుంటూ వచ్చాడు. ఇందుకు 11 రోజులు పట్టడం గమనార్హం. ‘సివాన్ నుంచి హర్యానా-ఢిల్లీ బార్డర్‌‌కు చేరుకోవడానికి పదకొండు రోజులు పట్టింది. మూడు కొత్త అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఈ ఉద్యమం ముగిసేంత వరకు నేను ఇక్కడే ఉంటా’ అని మాంఝీ పేర్కొన్నాడు.