- మున్సిపల్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్‌కు వివరించిన కమిషనర్ రోనాల్డ్ రాస్
హైదరాబాద్, వెలుగు : జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్ అధికారులకు సూచించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. సోమవారం బల్దియా హెడ్డాఫీసులో కమిషనర్ రోనాల్డ్ రాస్తో కలిసి జీహెచ్ఎంసీ పరిధిలో సర్కిల్ ప్రత్యేక అధికారులు, జోనల్ కమిషనర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రజాపాలన కార్యక్రమం నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను దానకిశోర్‌కు బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ వివరించారు. ప్రతి డివిజన్ లోని 4 లొకేషన్లలో కౌంటర్లు ఏర్పాటు చేయనున్నామని.. అర్జీదారులు ఎక్కువగా ఉంటే అదనంగా మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తామని రోనాల్డ్ రాస్ తెలిపారు. మొత్తం జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 600 లోకేషన్లలో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని..
అందుకోసం 5 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, మరో 5 వేల మంది వలంటీర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సమావేశంలో ప్రత్యేక అధికారులు, జోనల్ కమిషనర్లతో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు.
ప్రజా పాలన కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి
ఎల్బీనగర్ : ప్రజా పాలన కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు ప్లానింగ్ రెడీ చేయాలని రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న గౌతమ్ సోమవారం రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా పాలన కార్యక్రమంపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
రంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీలోనూ దరఖాస్తులు తీసుకుంటామని జనాలకు తెలియజేయాలన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంఈవోలు, డిప్యూటీ తహసీల్దార్లు టీమ్స్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ చొప్పున ఐదింటిని గ్రామపంచాయతీలో ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.