కనమరుగవుతున్న గంగిరెద్దుల ఆట

  • గంగిరెద్దుల వృత్తిని వదిలి వ్యవసాయం వైపు మళ్లిన  600 కుటుంబాలు

రాజన్న సిరిసిల్ల, వెలుగు:  సంక్రాంతి వస్తుందంటే రారా బసవన్న, డూడూ బసవన్న అనే మాటలు ప్రతి ఊళ్లో వినిపిస్తుండేవి. కాలంతో పాటు గంగిరెద్దులను ఆడించే వారు ఆ వృత్తిని మానేస్తున్నారు.  రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోనరావుపేట మండలం కొండాపూర్‌‌‌‌లో 150 కుటుంబాలు, బావుసాయిపేటలో 150 కుటుంబాలు, మరిమడ్లలో 50 కుటుంబాలు, చందుర్తి మండలంలో సనుగుల,  జోగాపూర్ గ్రామాల్లో 300  వరకు  జిల్లాలో మొత్తం 600 కుటుంబాలు గంగిరెద్దుల ఆట ద్వారా జీవనాన్ని కొనసాగించేవారు.  

ఉదయమే గంగిరెద్దులను ముస్తాబు చేసుకుని పల్లెలకు వెళ్లి గంగిరెద్దులను ఆడించేవాళ్లు.ప్రస్తుతం  గంగిరెద్దుల ఆటకు ఆదరణ కరువైంది. వ్యవసాయం, ఇతర కూలీలు పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. తాత ముత్తాతల నుంచి ఆనాదిగా వస్తున్నా ఆచారాన్ని వదులుకుని  సాగుబాట పడుతున్నారు.  వ్యవసాయం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.