
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో డ్వాక్రా సంఘాల గురించి మర్చిపోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం (మార్చి 8) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మహిళా శక్తి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరై ప్రసగించారు. గత కాంగ్రెస్ పాలనలో డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు.. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పదేళ్ల పాటు డ్వాక్రా సంఘాలను పట్టించుకోలేదని మండిపడ్డారు.
మేం అధికారంలోకి వచ్చాక.. మహిళ స్వయం సహయ సంఘాలకు ఏడాదికి రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇందులో భాగంగా.. ఈ ఏడాది రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు.. వివిధ వ్యాపారాలు చేసే విధంగా ఒప్పందాలు చేశామని.. ఇందులో భాగంగానే మహిళ స్వయం సహాయ సంఘాలకు ఆర్టీసీ బస్సులను ఇచ్చామన్నారు. మహిళలు ఇవాళ 600 ఆర్టీసీ బస్సులకు యజమానులు అయ్యారని అన్నారు.
ALSO READ | ఇందిరా మహిళా శక్తి దేశానికి ఘనకీర్తీ : మంత్రి సీతక్క
అలాగే.. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను డ్వాక్రా మహిళలు ఉత్పత్తి చేయబోతున్నారని తెలిపారు. తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి మహిళలే పునాదులు కావాలని ఆకాంక్షించారు. ఆదర్శ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను కూడా మహిళలకే అప్పజెప్పామని గుర్తు చేశారు. గతంలో మహిళలకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు అయినా ఇచ్చిందా..? గతంలో పేదలు చదువుకునే పాఠశాలలు, కళాశాలల గురించి పట్టించుకున్నారా..? అని ప్రశ్నించారు. మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు.