ఏపీలో కరోనా కల్లోలం: ఒక్కరోజే 6 వేలకు పైగా కేసులు.. 65 మరణాలు

ఏపీలో కరోనా కల్లోలం: ఒక్కరోజే 6 వేలకు పైగా కేసులు.. 65 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. కరోనా కేసులు, మరణాలలో రోజుకో పీక్ నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో 49,553 శాంపిల్స్ టెస్ట్ చేయగా రికార్డు స్థాయిలో 6045 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్క రోజులోనే 65 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒకే రోజులో నమోదైన కేసులు, మరణాల సంఖ్యలో ఇదే అత్యధికం. ఏపీలో కరోనా పరిస్థతులపై రాష్ట్ర ఆరోగ్య శాఖ బుధవారం తాజాగా బులిటెన్‌ విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం క‌రోనా బారినపడిన వారి సంఖ్య 64,713కి చేరింది. అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 2,461 మంది, విదేశాల నుంచి తిరిగి వ‌చ్చిన వారు 434 మంది ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 32,127 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 31,763 మంది రాష్ట్రంలోని వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

800 దాటిన కరోనా మరణాలు

ఏపీలో కొద్ది రోజులుగా క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో క‌రోనా కార‌ణంగా 65 మంది ప్రాణాలు కోల్పోయార‌ని ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. గుంటూరులో 15 మంది, కృష్ణా జిల్లాలో 10 మంది, పశ్చిమ గోదావ‌రి జిల్లాల్లో 8 మంది, తూర్పు గోదావరి జిల్లాల్లో ఏడుగురు మృతి చెందారు. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఐదుగురు చొప్పున, విజయనగరం జిల్లాలో నలుగురు మరణించారు. ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా మృతుల సంఖ్య 823కి చేరింది.