కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రా్లలో కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం (ఏప్రిల్ 7వ తేదీన) 6050 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంత భారీగా కేసులు రావడం 203 రోజుల తర్వాత ఇదే తొలిసారి అని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 14 మంది కొవిడ్ బాధితులు మృత్యువాత పడ్డారు. మహారాష్ట్రలో ముగ్గురు, కర్ణాటక, రాజస్థాన్‌లలో ఇద్దరు చొప్పున, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, పంజాబ్, కేరళలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. పుదుచ్చేరి అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
కొవిడ్ కేసులు పెరుగుతుండడంపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రజారోగ్య సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శుక్రవారం(ఏప్రిల్ 7న) రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇన్‌ఫ్లూయెంజా వంటి అనారోగ్యం, తీవ్రమైన శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ కేసుల వ్యాప్తిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాలను (ఎమర్జెన్సీ హాట్‌స్పాట్స్) గుర్తించి... దాని కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
కొవిడ్ నిర్ధరణ పరీక్షల సంఖ్యను పెంచాలని, అవసరమైన వారందరికీ టీకాలు అందజేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సూచించారు. వైరస్ బాధితులకు చికిత్స అందించే ఆస్పత్రుల్లో సౌకర్యాలపై ఈ నెల 10, 11 తేదీల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాల్లోని అధికార యంత్రాంగాలు, ఆరోగ్య శాఖ అధికారులతో ఈ నెల 8, 9 తేదీల్లో వైద్య సదుపాయాల సన్నద్ధతపై సమీక్షించాలని ఆరోగ్య శాఖ మంత్రులను కోరారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచడంతో పాటు ప్రజల్లో కొవిడ్ నియంత్రణ చర్యలపై అవగాహనను మరింతగా పెంచాలన్నారు.
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య 88,503గా నమోదైంది. ప్రస్తుతం వ్యాధి విస్తరణకు కారణమవుతున్నాయని భావిస్తున్న వేరియంట్లు...ఎక్స్‌బీబీ.1.5, బీక్యూ.1, బీఏ.2.75, సీహెచ్.1.1, ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీఎఫ్, ఎక్స్‌బీబీ.1.16లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరంతర నిఘా కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.