2024లో 60 శాతం ఉగ్రవాదులు హతమయ్యారు..జమ్మూ కాశ్మీర్ పరిస్థితిపై ఆర్మీ చీఫ్

జమ్మూకాశ్మీర్ ఉగ్రవాద కార్యకలాపాలు బాగా తగ్గాయన్నారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. సోమవారం (జనవరి 13, 2025) న నియంత్రణ రేఖ (ఎల్ ఓసీ) వద్ద పరిస్థితిని గురించి వివరిస్తూ..జమ్మూ  కాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాదుల్లో 60 శాతం మంది పాకిస్తానీలు హతమయ్యారని తెలిపారు. ఇక మిగిలి ఉన్న వారిలో 80 శాతం మంది పాకిస్థానీయులే అని అన్నారు.  

జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. ఫిబ్రవరి 2021 నుండి నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ కొనసాగుతోంది. మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసేందుకు డ్రోన్ ప్రయత్నాలతో పాటు ఇంటర్నేషనల్ బోర్డర్ (ఐబి) సెక్టార్ నుంచి కూడా చొరబాటు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జనరల్ ద్వివేది చెప్పారు.

గడిచిన ఆరు నెలల్లో ఉత్తర కాశ్మీర్, దోడా-కిష్త్వార్ బెల్ట్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. అయితే హింసాత్మక ఘటనలు తక్కువగా ఉన్నాయన్నారు. 2024లో అమర్ నాథ్ యాత్రలో ఐదు లక్షల మందికి గాపై యాత్రికులు వచ్చారు. దీంతో పాటు ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాం..ఇదంతా సానుకూల మార్పుకు సూచికలన్నారు.

ALSO READ | జమ్మూ కశ్మీర్ వరప్రదాయని.. సోనామార్గ్ టన్నెల్ ప్రారంభించిన మోదీ..

ఇక చైనాలో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ ఏసి) వెంబటి పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. సానుకూల పరిణామలతో తూర్పు లడ్డాఖ్ లోని చివరి రెండు పాయింట్లనుంచి ఇటీవల భారత, చైనా సైన్యం ఉపసంహరించుకుందని ద్వివేది అన్నారు. 

సరిహద్దు మౌలిక సదుపాయాలను పెంచడం, అభివృద్ధిపై సైన్యం దృష్టి సారించిందని ఆయన చెప్పారు. లడఖ్‌లోని గాల్వాన్‌లో సైనిక ప్రతిష్టంభన కారణంగా నాలుగేళ్లుగా స్తంభించిన ద్వైపాక్షిక సంబంధాలను భారత్, చైనాలు పునరుద్ధరించుకుంటున్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ అన్నారు.