మోదీ కేబినెట్లో బీజేపీకి 61 ..మిత్రపక్షాలకు 10 మంత్రి పదవులు

మోదీ కేబినెట్లో బీజేపీకి 61 ..మిత్రపక్షాలకు 10 మంత్రి పదవులు

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో తొలి సంకీర్ణ సర్కారు కొలువుదీరింది. దేశానికి17వ ప్రధాన మంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఆయన దైవసాక్షిగా హిందీలో ప్రమాణం చేశారు. దీంతో దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన నేతగా మోదీ రికార్డ్ సృష్టించారు. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లాన్స్​లో ప్రారంభమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం మూడు గంటలపాటు సాగింది. మోదీతోపాటు మరో 71 మందితో కేంద్రమంత్రులుగా ప్రెసిడెంట్ ముర్ము ప్రమాణం చేయించారు. 

తెలంగాణ నుంచి బండి సంజయ్ కి తొలిసారి కేంద్ర కేబినెట్​లో చోటు దక్కగా.. కిషన్ రెడ్డి మరోసారి కేబినెట్ ​మంత్రిగా ప్రమాణం చేశారు. ఇక ఏపీ నుంచి కూడా ముగ్గురు కేంద్ర మంత్రులుగా చాన్స్ దక్కించుకున్నారు. వీరిలో శ్రీకాకుళం నుంచి గెలిచిన రామ్మోహన్​ నాయుడు (36) కేబినెట్​లోనే అతి పిన్న వయస్కుడు. మోదీతో సహా మొత్తం 30 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఐదుగురు స్వతంత్ర హోదాలో, 36 మంది సహాయ మంత్రులుగా నియమితులయ్యారు. 9 మంది కొత్తవారికి కేంద్ర మంత్రులుగా చాన్స్ దక్కింది. 

మంత్రివర్గంలో 8 మంది మహిళలకు చోటు కల్పించారు. వీరిలో నిర్మలా సీతారామన్, అన్నపూర్ణ దేవి కేబినెట్ మంత్రులుగా, మిగతా వారు సహాయ మంత్రులుగా నియమితులయ్యారు. కేంద్ర మంత్రులుగా చాన్స్ దక్కినవారిలో రాజ్యసభ సభ్యులు 8 మందితోపాటు తాజా ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు నేతలు కూడా ఉన్నారు. ప్రమాణం చేసిన కేంద్ర మంత్రులందరికీ శాఖలను తర్వాత కేటాయించనున్నారు. కేంద్రంలో పదేండ్ల యూపీఏ పాలన తర్వాత 2014లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రాగా మోదీ తొలిసారిగా ప్రధాని అయ్యారు. 2019లో రెండోసారి కూడా సొంతంగానే మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈసారి మ్యాజిక్ ఫిగర్ (272)కు 32 సీట్ల దూరంలోనే బీజేపీ నిలిచిపోవడంతో ఎన్డీయే మిత్రపక్షాల మద్దతుతో తొలిసారి సంకీర్ణ సర్కారు ఏర్పాటైంది.  

కేంద్ర కేబినెట్ లో మోదీతోసహా మొత్తం 72 మంది మంత్రులు ఉండగా.. బీజేపీ నుంచి 61 మంది మంత్రులయ్యారు. టీడీపీ, జేడీయూ, ఆర్ఎల్డీ నుంచి ఇద్దరు చొప్పున మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక జేడీఎస్, శివసేన, అప్నాదళ్, హెచ్ఏఎం, ఆర్పీఐ పార్టీలకు ఒక్కోటి చొప్పున మొత్తం 5 మంత్రి పదవులు దక్కాయి.