
పాట్నా, హజారీబాగ్: బిహార్లో పిడుగులు, వడగండ్లు(రాళ్లవాన) పడి 61 మంది మృతిచెందారు. గురువారం కురిసిన వడగండ్లు(రాళ్లవాన) కారణంగా 39 మంది, పిడుగుల కారణంగా 22 మంది మరణించారని శుక్రవారం అధికారులు ప్రకటించారు. నలంద జిల్లాలో అత్యధికంగా 23 మంది చనిపోయారు. ‘‘బిహార్లోని పలు జిల్లాల్లో పిడుగులు, రాళ్ల వానల కారణంగా మరణించిన వారి సంఖ్య 61కి పెరిగింది’’ అని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
నలంద జిల్లాలో అత్యధికంగా 23 మంది, భోజ్పూర్(6), సివాన్, గయా, పాట్నా, షేక్ పురా (4 చొప్పున), జముయి (మూడు), జెహానాబాద్ (2) మరణాలు సంభవించాయి. గోపాల్గంజ్, ముజఫర్పూర్, అర్వాల్, దర్భంగా, బెగుసరాయ్, సహర్సా, కతిహార్, లఖిసరాయ్, నవాడా, భగల్పూర్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. వడగండ్లు, ఈదురుగాలుల వల్లపెద్ద సంఖ్యలో ఇండ్లు దెబ్బతిన్నాయి. అకాల వర్షం సృష్టించిన బీభత్సంతో సంభవించిన మరణాలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
బుధవారం కూడా బిహార్లోని నాలుగు జిల్లాల్లో పిడుగుల ధాటికి 13 మంది మరణించారు. బిహార్ ఎకనామిక్ సర్వే రిపోర్టు ప్రకారం పిడుగులు పడి 2023లో రాష్ట్రంలో అత్యధికంగా 275 మరణాలు సంభవించాయి. మరోవైపు, జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్ జిల్లాలో పిడుగులు పడి వేరువేరు చోట్ల నలుగురు వ్యక్తులు మృతిచెందారు. గురువారం మధ్యాహ్నం పద్మ, చర్చ్ బ్లాక్ ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగాయి. పద్మ బ్లాక్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చర్చు గ్రామంలో గంగో కిస్కు తన పొలంలో కట్టెలు
కొడుతుండగా పిడుగు పడి చనిపోయాడు.