- మిగిలిన 39 శాతం చెరువులనైనా రక్షించుకోవాలి
- లేక్స్ 2024 సదస్సులో హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్సిటీ పరిధిలోని చెరువులు 61 శాతం కనుమరుగయ్యాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. మిగిలిన 39 శాతం చెరువులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్), నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(నీరీ) సంస్థలు బేగంపేటలోని పర్యాటక భవన్‌లో మంగళవారం ‘లేక్స్ 2024’ పేరుతో సదస్సు నిర్వహించాయి. రంగనాథ్ మాట్లాడుతూ.. దేశంలో పట్టణీకరణ కంటే తెలంగాణలో12 శాతం ఎక్కువ ఉందన్నారు.
రాష్ట్రంలో 47 శాతం పట్టణీకరణ జరిగిందని, 2050 నాటికి 75 శాతానికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో చెరువులను కాపాడుకోలేకపోతే మరో 15 ఏండ్లకు సిటీలో చెరువులు మిగలవని ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా వచ్చాక జనం ఎఫ్టీఎల్, బఫర్, ప్రభుత్వ భూముల వివరాలు తెలుసుకుని ఆస్తులు కొంటున్నారన్నారు.