టర్కీలో భారీ భూకంపం : ఇస్తాంబుల్ లో భవనాలు ఖాళీ చేయిస్తున్న అధికారులు

టర్కీలో భారీ భూకంపం : ఇస్తాంబుల్ లో భవనాలు ఖాళీ చేయిస్తున్న అధికారులు

టర్కీ దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది. 6.2 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి ఇస్తాంబుల్ సిటీ వణికిపోయింది. 2025, ఏప్రిల్ 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషాలకు భూకంపం వచ్చిందని.. తీవ్రత ఎక్కువగా ఉందని టర్కీ దేశపు AFAD విపత్తు సంస్థ వెల్లడించింది. 

6.2 తీవ్రతతో వచ్చిన భూకంప కేంద్రం.. ఇస్తాంబుల్ సిటీకి ఉత్తరం వైపు 80 కిలోమీటర్ల దూరంలోని సిలివ్రి ప్రాంతంలో ఉందని.. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని టర్కీ దేశం ప్రకటించింది. 

ఇస్తాంబుల్ సిటీ జనం కోటి 60 లక్షల మంది.. భూకంప తీవ్రత కూడా ఈ సిటీపైనే ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది టర్కీ సర్కార్. తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. భారీ భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. భవనాలు దెబ్బతిన్నాయా లేదా.. భూకంపం ధాటికి భవనాలకు ప్రమాదం వచ్చిందా లేదా అనేది పరిశీలిస్తున్నారు. అప్పటి వరకు ప్రజలు ఎవరూ భవనాల్లోకి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. 

భూకంపం వచ్చిన సమయంలో.. భారీ భవనంలోని బాల్కనీలో ఉన్న ఓ వ్యక్తి.. భయంతో కిందకు దూకేయటంతో తీవ్రంగా గాయపడ్డాడని ప్రకటించిన అక్కడి ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టంపై స్పష్టమైన సమాచారం లేదని వెల్లడించింది.