ఆదిలాబాద్, మేడ్చల్‌ జిల్లాల్లో రెండు ప్రమాదాల్లో 62 మందికి గాయాలు

ఆదిలాబాద్, మేడ్చల్‌ జిల్లాల్లో రెండు ప్రమాదాల్లో 62 మందికి గాయాలు
  • ఆదిలాబాద్‌ జిల్లాలో 15 అడుగుల లోయలో పడిపోయిన ఐచర్
  • ఒకరు మృతి, 47 మందికి గాయాలు 
  • ఘట్‌కేసర్‌ వద్ద అదుపు తప్పిన డీసీఎం, 15 మందికి గాయాలు

ఆదిలాబాద్/ఘట్‌కేసర్‌, వెలుగు : ఆదిలాబాద్, మేడ్చల్‌ జిల్లాల్లో ఆదివారం జరిగిన రెండు ప్రమాదాల్లో ఒకరు చనిపోగా, 62 మంది గాయపడ్డారు. రెండు వాహనాలకు బ్రేక్‌లు ఫెయిల్‌ కావడంతో అదుపుతప్పి బోల్తా పడ్డాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకరు చనిపోగా, 47 మందికి, ఘట్‌కేసర్‌లో 15 మందికి గాయాలు అయ్యాయి.

జంగూబాయి దర్శనానికి వెళ్తుండగా...

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌కు చెందిన ఆదివాసీలు ఆదివారం జంగుబాయి దర్శనానికి వెళ్తుండగా నార్నూర్ మండలంలోని మాలేపూర్ ఘాట్‌లో ప్రమాదం జరిగింది. దీక్షలో ఉన్న సూర్యగూడ మాజీ సర్పంచ్​ కుమ్ర లింగుతో పాటు గ్రామానికి చెందిన ఆదివాసీలు ఐచర్ వాహనంలో దాదాపు 60 మంది ఆదివారం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని మహారాజ్ గూడ వెలిసిన జంగుబాయి జాతరకు బయలు దేరారు. ఈ క్రమంలోనే మాలేపూర్‌ రెండవ మూలమలుపు ఘాట్‌వద్ద ఐచర్ బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి.. చెట్లను ఢీకొట్టుకుంటూ లోయలోపడిపోయింది. వాహనం దాదాపు 15 అడుగుల లోతులో పడిపోవడంతో ప్రయాణికులు చెల్ల చెదురయ్యారు. 

చాలా మందికి తలకు, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాద స్థలంలో క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. పోలీసులు, 108 సిబ్బంది సంఘటనస్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో గాయపడిన వారిని నార్నూర్, ఉట్నూర్, ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంలో మాజీ సర్పంచ్ కుమ్ర లింగు తండ్రి మల్కు (50) మరణించాడు. గాయపడిన 47 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురికి ఆదిలాబాద్‌రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. మిగతావారిని ఉట్నూర్‌, నార్నూర్‌ఆస్పత్రిలో చేర్చారు. గాయపడని వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు రిమ్స్‌డైరెక్టర్‌జైసింగ్‌రాథోడ్‌ చెప్పారు. రిమ్స్ హాస్పిటల్లో క్షతగాత్రులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. ఈ సంఘటనపై ఖానాపూర్‌ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు డాక్టర్లతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 

యాదగిరిగుట్ట నుంచి వస్తుండగా.. 

ఘట్ కేసర్ పోలీస్​స్టేషన్ పరిధిలో డీసీఎం వ్యాన్ అదుపు తప్పడంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన పొట్టోళ్ల బాలయ్య నగరంలోని ఎన్టీఆర్ నగర్ లో ఉంటున్నాడు. శనివారం సాయంత్రం తన మనవరాలు పుట్టువెంట్రుకలు తీయడానికి కుటుంబసభ్యులు, బంధువులతో కలసి డీసీఎం వ్యాన్​లో యాదగిరిగుట్టకు వెళ్లాడు. కార్యక్రమం పూర్తయ్యాక ఆదివారం సాయంత్రం తిరిగి వస్తుండగా ఘట్​కేసర్ బైపాస్ రోడ్డులోని మైసమ్మగుట్ట దగ్గర బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో డీసీఎంను సర్వీస్ రోడ్డుపైకి మళ్లించగా డీసీఎం ముందు వెళ్తున్న ఆరు బైకులను ఢీకొట్టుకుంటూ పల్టీ కొట్టింది. 

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఏదులాబాద్​కు చెందిన మంజుల, చందన, విగ్నేష్, భవ్యశ్రీ, యశ్వంత్​లతో పాటు వ్యాన్​లో ఉన్న పది మంది తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ జంగయ్యచారి పరారీ కాగా, పోలీసులు, స్థానికులు గాయపడ్డవారిని ఘట్​కేసర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడిన కొందరిని నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానకు, మరికొంత మందిని గాంధీకి తరలించారు. డీసీఎం వ్యాన్​ను పోలీస్​స్టేషన్​తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అడ్మిన్ ఎస్ఐ ప్రభాకర్​రెడ్డి తెలిపారు.