రన్నింగ్లో యువకులతో పోటీ పడుతున్న 62 ఏళ్ల ద్వారకానాథ్

నడవడానికే ఆయాస పడే వయస్సులో 10 కిలోమీటర్లు అలిసిపోకుండా పరుగెత్తుతున్నారు ఓ పెద్దాయన. వాకింగ్, రన్నింగ్ లో యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రన్నింగ్ లో ఇప్పటికే చాలా పతకాలు సాధించాడు. సంగారెడ్డికి చెందిన ద్వారకానాథ్.. వయసు 62 ఏళ్లు. అయినా కుర్రకారుకు ఏ మాత్రం తీసిపోని విధంగా రన్నింగ్ లో సత్తా చాటుతున్నారు. వాకర్స్ పార్క్ లో ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా రన్నింగ్ చేస్తుంటారు. 1996లో రన్నింగ్ మొదలు పెట్టిన ద్వారకానాథ్.. ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నారు. జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించారు. స్థానికంగా కూడా చాలా పతకాలు సొంతం చేసుకున్నారు.

రోజూ నడవడం, పరుగెత్తడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని ద్వారకానాథ్ చెప్పారు. 10 కిలోమీటర్లు పరిగెత్తగలనని తెలిపారు. ఇప్పటి యువత ఆరోగ్యంపై శ్రద్ద పెట్టడం లేదని..జంక్ ఫుడ్ తిని అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత మంచి ఆహారం తీసుకోవడంతో పాటు ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచిస్తున్నారు. వాకింగ్ పార్క్ లో 60 ఏళ్ల ద్వారకానాథ్ పరుగులు చూసి తాము రన్నింగ్ మొదలు పెట్టామని స్థానికులు చెబుతున్నారు. ద్వారకానాథ్ ఉత్సాహం చూస్తే ఆశ్చర్యమేస్తుందని చెబుతున్నారు.