తొలిపూజకు ఖైరతాబాద్ గణేశుడు రెడీ.. ఈ సారి 63 అడుగుల ఎత్తులో దర్శనం

 తొలిపూజకు ఖైరతాబాద్ గణేశుడు రెడీ..  ఈ సారి 63 అడుగుల ఎత్తులో  దర్శనం

వినాయక చవితి వచ్చిందంటే ​ఖైరతాబాద్ బడా గణేశ్​.. స్పెషల్ అట్రాక్షన్. తెలుగు రాష్ట్రాల్లో  ఖైరతాబాద్​లో ఏర్పాటు చేసే మహా గణపతి విగ్రహం ట్రెండింగ్​గా నిలుస్తుంది. విఘ్నాధిపతిగా తొలి పూజ అందుకునే గణపయ్యను వాడవాడలా ఘనంగా పూజించే వేడుకకు మరో రెండు రోజులే మిగిలి ఉంది.  గతేడాది 58 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్‌‌‌‌ బడా గణపతి ఈసారి 63 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకుంది. విగ్రహ పనులు కూడా పూర్తయ్యాయి. సెప్టెంబర్ 17న ఉత్సవకమిటీ కర్రలను తొలగించనుంది.  

రాష్ట్ర గవర్నర్ తమిళిసై  సెప్టెంబర్ 18న ఉదయం 10 గంటలకు తొలి పూజలు నిర్వహించనున్నారు.  ఈ ఏడాది నవరాత్రి వేడుకలకు శ్రీ దశ మహా విద్యా గణపతిగా గణనాథుడు ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనమివ్వనున్నారు. గతేడాది నుంచి పర్యావరణహితంగా నిర్మిస్తుండగా.. ఈసారి పూర్తిగా మట్టితో తయారు చేశారు. 

ALSO READ: విశ్వనాయకుడు వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా చెప్పండి..
 

 విగ్రహ రూపకర్తలు వీరే..

బడా గణపతిని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయారు చేసే పనిలో నిమగ్నమవుతారు. ఇందులో భాగంగా విగ్రహ డిజైన్ హైదరాబాద్​కు చెందిన సి. రాజేందర్,  నమూనా ప్రింట్ పనులు నల్లనాగుల శరత్ 30 ఏండ్లుగా చేస్తున్నారు. వెల్డింగ్ వర్క్ మచిలీపట్నానికి చెందిన నాగబాబు బృందం, మట్టి పనులను ఒడిశాకు చెందిన మట్టి కళాకారుడు జోగారావు టీమ్ చూస్తుంది.  చైన్నైకి చెందిన కళాకారుడు మూర్తి విగ్రహం డిజైన్ చేశారు.