
- రెండు వాహనాలు సీజ్
సంగారెడ్డి టౌన్, వెలుగు : గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను సంగారెడ్డి రూరల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది శనివారం చాకచక్యంగా పట్టుకున్నారు. సుమారు రూ.మూడు కోట్ల విలువైన గంజాయితో పాటు ముగ్గురు నిందితులు, రెండు వాహనాలను సీట్ చేశారు. సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ వివరాలు వెల్లడించారు. బిహార్ లోని బక్సర్ జిల్లాకు చెందిన శంభునాథ్, మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చెందిన సంజయ్ పాండురంగ గోండే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రదీప్ కుమార్ ముఠాగా ఏర్పడి ఒడిశా నుంచి ఆంధ్ర– తెలంగాణ బార్డర్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన హనుమాన్ మోహిత్, సమీర్ గవండేలా ఆదేశాల మేరకు ఈ ముఠా.. ఒడిశాలోని జెండా ఏజెన్సీ ప్రాంతంలో ఉండే త్రినాథ్ అనే వ్యక్తి నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తోంది. శంభునాథ్ 12 ఏళ్ల క్రితం హైదరాబాద్, షాద్ నగర్ లో లేబర్ గా పనిచేశాడు. 2018లో మనోహరాబాద్, ముప్పిరెడ్డిపల్లిలో కూడా కార్మికుడిగా పనిచేస్తూ పాన్ షాప్ నిర్వహించేవాడు. ఈ క్రమంలో బిహార్ కు చెందిన భూషణ్.. చిన్నచిన్న గంజాయి ప్యాకెట్లను తన కార్మికులకు అమ్ముతుండగా 2021లో మనోహరాబాద్ పోలీసులు ఎన్డీపీఎస్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో భూషణ్ తో హనుమాన్ మోహిత్, సమీర్ గావండి, వారి డ్రైవర్ సంజయ్ పాండురంగ పరిచయం చేసుకున్నారు.
హనుమాన్ మోహిత్, సమీర్ గావండీ ఒడిశాలోని జెన్ భాయ్ ప్రాంతానికి చెందిన త్రినాథ్ ను శంభునాథ్ కు పరిచయం చేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా ఎండు గంజాయిని రవాణా చేసిన ప్రతిసారి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలో ఇప్పటివరకు రెండు వేల కిలోల వరకు గంజాయి తరలించారు. కొద్ది రోజుల కిందట శంభు నాథ్ తన వాహనంలోని ట్రాలీ కింది భాగంలో ప్రత్యేక బాక్స్ లాంటి నిర్మాణం చేసుకొని గంజాయి తరలిస్తున్నాడు. ఈనెల 22న మహారాష్ట్ర నుంచి సంజయ్ ఒక వాహనంలో, శంభునాథ్ తన వాహనంతో పాటు క్లీనర్ ప్రదీప్ ను తీసుకొని ఒడిశాలోని జెన్ భాయ్ ప్రాంతానికి చేరుకొని త్రినాథ నుంచి 635 కిలోల గంజాయిని రెండు వాహనాలలో లోడ్ చేయించాడు. ఈనెల 24న బయలుదేరి సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధికి 25న చేరుకున్నారు. పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వాహనాలను తనిఖీ చేయగా గంజాయి దొరికింది.