భారీగా మద్యం బాటిళ్లు పట్టివేత
తెలంగాణ సరిహద్దుల్లో కర్నూలు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో దాడులు
కర్నూలు: పక్క రాష్రాల్లో తక్కువ ధరకు లభిస్తున్న మద్యం అక్రమంగా తరలించి ఏపీలో సొమ్ము చేసుకుందామనే వారిని స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసులు వలపన్ని పట్టుకుంటున్నారు. వేయి కళ్లతో నిఘా కాస్తూ.. ఏయే మార్గాల్లో అక్రమంగా తరలిస్తున్నారో గుర్తించి పట్టుకుంటున్నారు. నిన్న ఒక్క రోజే కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆధ్వర్యంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి స్వయంగా పర్యవేక్షించగా వేర్వేరు చోట్ల 64 మంది అక్రమ మద్యం రవాణాదారులు పట్టుబడ్డారు. భారీ మొత్తంలో మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. మరికొందరు ఇసుక,నాటు సారా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అక్రమ మద్యం మరియు నాటు సారా పై 43 కేసులు నమోదు చేసి 64 మంది అరెస్టు చేశారు. అలాగే 20 వావాహనాలు సీజ్ చేశారు. వివిధ బ్రాండ్లకు చెందిన 2,425 బాటిల్స్ ( 357 లీటర్లు) మద్యం, 255 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని 4,900 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం చేశారు. ఇసుక అక్రమ రవాణా పై 1 కేసు నమోదు చేశారు.ఎక్కడైనా మద్యం, ఇసుక అక్రమంగా రవాణా అవుతున్నట్లు తెలిస్తే అక్కడి సమాచారం ఫోటోలు, వీడియోలను 7993822444 సెల్ నెంబర్‌కు Whatsaap ద్వారా పంపించాలని.. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్న పిలుపునకు చాలా మంచి స్పందన వస్తోందని.. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప తెలిపారు.