- రాష్ట్రంలో సొంతూర్లకు వెళ్లేవారి కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
- 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం
- జిల్లాల నుంచి హైదరాబాద్కు ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్, వెలుగు : సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లేవారి కోసం ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. గత సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులు నడపాలని ప్లాన్ చేయగా.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో 5,246 బస్సులను నడిపింది. గత అనుభవం దృష్ట్యా ఈసారి బస్సుల సంఖ్యను 6,432కు పెంచింది. ఈనెల 9 నుంచి 15 వరకు ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోని ఊర్లకు ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. అలాగే, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కూ ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ప్రధానంగా అమలాపురం, కాకినాడ, కందుకూరు, నర్సాపురం, పోలవరం, రాజమండ్రి, రాజోలు, ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి తదితర ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయి.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుగుపయనమయ్యే వారి కోసం కూడా ప్రత్యేక బస్సులను సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సంక్రాంతికి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నుంచి ఎలక్ట్రిక్ బస్సులను సైతం నడపాలని ప్లాన్ చేస్తున్నది. సంక్రాంతి ఆపరేషన్స్ ఆర్టీసీకి ఎంతో కీలకమని, ఈ దిశగా పూర్తి సన్నద్ధం కావాలని క్షేత్రస్థాయి అధికారులను ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది. హైదరాబాద్ లోని రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పందిళ్లు, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని తెలిపింది. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ ను www.tgsrtcbus.in వెబ్ సైట్ లో చేసుకోవాలని సంస్థ పేర్కొంది. మరిన్ని వివరాల కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-6944 0000, 040-2345 0033 నంబర్లను సంప్రదించాలని సూచించింది.