సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పండుగను దృష్టిలో ఉంచుకొని 6432 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు ప్రకటనలో తెలిపింది.
సంక్రాంతి పండుగ అంటే వివిధ ప్రాంతాలలో ఉన్న ప్రజలకు తమ సొంతూళ్లకు వెళ్లి పండుగ ఘనంగా నిర్వహిస్తుంటారు. గత ఏడాది 4484 ప్రత్యేక బస్సులను నడపాలని ప్లాన్ చేయగా.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 5246 బస్సులను నడిపాల్సి వచ్చింది. గత సంక్రాంతి అనుభవం దృష్ట్యా ఈసారి 6432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జనవరి 9వ తేది నుంచి 15 వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసేలా ప్రత్యేక అధికారులను నియమించింది.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక బస్సులు:
అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ప్రధానంగా అమలాపురం, కాకినాడ, కందుకూరు, నర్సాపురం, పోలవరం, రాజమండ్రి, రాజోలు, ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి, తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అలాగే, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుగుపయనమయ్యే వారి కోసం కూడా ప్రత్యేక బస్సులను సంస్థ ఏర్పాటు చేసింది.
తెలంగాణ ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు:
ఈ సంక్రాంతికి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నుంచి ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు టీజీఎస్ఆర్టీసీ అధికారులు. సంక్రాంతి పండుగకు బస్సుల నిర్వహణ టీజీఎస్ఆర్టీసీకి ఎంతో కీలకమని, ఆ మేరకు పూర్తిగా సన్నద్ధం అయినట్లు యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్ లోని రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.
ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ ను www.tgsrtcbus.in వెబ్ సైట్ లో చేసుకోవాలని పేర్కొంది. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించింది.