నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలోని వివిధ గ్రామాల్లో 648 ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో 455 మంది రైతులకు నష్టం జరిగింది. 30 శాతానికి పైగా పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఆరు పంచాయతీ రోడ్లు డ్యామేజ్కాగా, మూడు కల్వర్టులు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. వీటి నష్టం సుమారు రూ.1.07 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 22 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
నార్కట్‌పల్లిలో రెండు, కేతేపల్లి మండలంలో 10, తిప్పర్తి, కనగల్, దేవరకొండ, మిర్యాలగూడ, నల్గొండలో ఒక్కొక్కటి చొప్పున, నకిరేకల్‌లో 5 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. 1628 చెరువులకు184 చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దాదాపు 413 చెరువుల్లో 50 నుంచి వంద శాతం మేర నీటి నిల్వలు ఉన్నాయి.
521 చెరువుల్లో 50 శాతం నీటి నిల్వలు ఉండగా, 487 చెరువుల్లో 25 శాతం మాత్రమే వరద నీరు చేరింది. అనుముల మండలం పేరూరు గ్రామం రెండు రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామానికి ఇరువైపులా చెరువు ఉండడంతో చెరువు అలుగుపోస్తుంది. దీంతో గ్రామం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.