- కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు
వెలుగు నవీపేట్ : జిల్లాలోని సొసైటీ, ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 65 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం తెలిపారు. నవీపేట్ మండలం అభంగపట్నం గ్రామంలో సహకార సంఘాలు, ఐకేపీ మహిళా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ధాన్యం సేకరణ డేటా ఎంట్రీలు, గోనె సంచులు, లారీల కొరత గురించి కేంద్రాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ప్రతీరోజు ఒక్కో కేంద్రం నుంచి కనీసం నాలుగు నుంచి ఐదు లారీల లోడ్ ల చొప్పున రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయాలని, సేకరించిన ధాన్యాన్ని వెంటవెంటనే లారీలలో లోడ్ చేయించి రైస్ మిల్లులకు పంపించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సన్నరకం, దొడ్డురకం ధాన్యం సేకరణకు వేర్వేరుగా 670 కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. ప్రతీరోజు సగటున 15 వేల నుంచి 18 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం సేకరణ జరుగుతోందని, 7వ తేదీ వరకు 65 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని వివరించారు.
నిబంధనలకు అనుగుణంగా 48 గంటల్లోపు రైతులకు చెల్లింపులు జరిగేలా ఓపీఎంఎస్ లో డాటా ఎంట్రీ చేయిస్తున్నామని తెలిపారు. రైతులకు సన్నరకం ధాన్యానికి సంబంధించి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2320 ముందుగా చెల్లించిన అనంతరం రూ.500 బోనస్ ను కూడా ప్రభుత్వం చెల్లిస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ పీడీ సాయాగౌడ్, డీసీఓ ఎన్.శ్రీనివాస్ రావు, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డి.ఎం రాజేశ్వర్, స్థానిక అధికారులు, నవీపేట్ సొసైటీ ల చైర్మన్ న్యాలకంటి అబ్బన్న, ఐకేపీ ఏపీఎం భూమేశ్వర్ గౌడ్ రైతులు తదితరులు ఉన్నారు.
48 గంటల్లో డబ్బులు చెల్లింపు
ఎడపల్లి, వెలుగు : నిజామాబాద్ జిల్లాలో ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోగా డబ్బులు చెల్లించేలా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. శుక్రవారం ఎడపల్లి మండలంలోని తానాకలాన్ గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు తీరును, తూకాన్ని, ధాన్యం నాణ్యతను పరిశీలించి మాట్లాడారు.
670 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీఓ శ్రీనివాస్ రావు, ఆర్డీఓ, తహసీల్దార్ ధన్వాల్, క్లస్టర్ ఆఫీసర్ రమ, సొసైటీ చైర్మన్ మల్కారెడ్డి, వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి, డైరెక్టర్లు కమలాకర్ రెడ్డి, లక్ష్మీ, సెక్రటరీ రాజారాం, ప్రభాకర్, సొసైటీ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.