మధ్య తరగతి జీవితాలు ఆగం! అప్పుల్లో 65 శాతం కుటుంబాలు

మధ్య తరగతి జీవితాలు ఆగం! అప్పుల్లో  65 శాతం కుటుంబాలు

భారతదేశంలో మధ్యతరగతి జీవితాలు ఆగం అవుతున్నాయి. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అనే పరిస్థితి వచ్చేసింది. బ్యాంకుల్లో  తగిన లాభం ఉండడం లేదని, షేర్ మార్కెట్లో ఆ డబ్బు పెడితే భారీ నష్టాలు చవి చూసే పరిస్థితి వస్తున్నది. గతంలో మాదిరి ఇన్వెస్టర్లు లాభాలు ఆశించే పరిస్థితి లేదు. అధిక ధరలు వేధిస్తున్నా.. మధ్యతరగతి ఉద్యోగుల జీతాలలో పెరుగుదల ఉండటం లేదు.  ఒకవైపు మన రూపాయి విలువ డాలరుతో పోల్చితే దారుణంగా పడిపోయింది. త్వరలో 90కి దిగజారిపోయే పరిస్థితి ఉంది. ఇది మన దేశానికి పెద్ద ఆర్థిక అవరోధంగా పేర్కొనక తప్పదు.  

ఉత్పాదకత పడిపోవడం, ఆహార పదార్థాల ధరలు 7.5 శాతం  పెరిగాయి.  విద్య, వైద్యం పిరం అయిపోయింది. మరోవైపు విద్యారంగం కునారిల్లుతుంటే.. మన కాలేజీలు, యూనివర్సిటీల పరిస్థితి అధ్వానం అయిపోయింది. కొనుగోలు శక్తి మధ్యతరగతి కుటుంబాలలో తగ్గిపోయింది.  వందలో కనీసం 65 శాతం కుటుంబాలు  అప్పుల్లో కూరుకునిపోయాయి. వాహనాల కోసం, గృహ నిర్మాణాల కోసం, పిల్లల చదువుల కోసం తీసుకున్న రుణాల ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఉన్నది. చివరికి హెల్త్ బీమాల రెన్యూవల్ కట్టలేక పరేషాన్​లో జనం ఉన్నారు.  మన దేశం పెట్టుబడుల మీద ప్రధానంగా కొనసాగే దేశం.  ఇప్పుడు అది తగ్గింది. ఈ దుస్థితి మీద రిజర్వు బ్యాంక్ కూడా  మౌనంగా ఉన్నది. 80 కోట్ల మందికి ఐదు కేజీల రేషన్ ఉచితంగా ఇచ్చి తాము మంచిపని చేస్తున్నాం అనే పరిస్థితి ఉన్నది.  

ట్రంప్​తో ఇండియాకు గడ్డు కాలమేనా?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం తమ దేశంలో అక్రమంగా ఉంటున్నవారిని వెనక్కి పంపుతామన్నారు.  ఇప్పటికే వందలాది మందిని వారి సొంత దేశాలకు తరలిస్తున్నారు. వీరిలో భారతీయులు కూడా ఎక్కువశాతం ఉండడం విశేషం.  దిగుమతి సుంకం పెంచుతాం అని, ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఆపుతాను అని ట్రంప్​  వెల్లడించారు. అమెరికాను మాన్యుఫాక్చర్ హబ్​గా మార్చుతామని అనడం ఒక రకంగా చైనాకు పెద్దగానే సవాల్ విసిరారని చెప్పవచ్చు.  ప్రపంచంలో అమెరికాను అగ్రభాగాన అన్ని రంగాల్లో నిలబెట్టడమే తన లక్ష్యంగా ట్రంప్  చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇంట, బయట భారతీయుల పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న వ్యక్తం అవుతున్నది.   గౌతమ్ అదానీ మీద అమెరికాలో  కేసు నమోదు అయిన నేపథ్యంలో అతనికి ప్రమాణ స్వీకారోత్సవం  ఆహ్వానం పంపలేదు. అయితే, ముకేశ్ అంబానీకి ఆహ్వానం పంపగా ఆయన కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఏది ఏమైనా ఇండియా ఇప్పుడు ఆర్థికంగా చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతున్నది. దీంతో  మధ్యతరగతి, సామాన్య కుటుంబాలు విలవిలలాడిపోయే పరిస్థితి  రాబోతున్నది.  

తగ్గిన మధ్యతరగతి ఆదాయం

ప్రపంచం ఇచ్చి పుచ్చుకోవడంపైన ముందుకు వెళుతుంది. గత 10 ఏండ్ల నుంచి అసలు పని కల్పించే  మాన్యుఫాక్చరింగ్ లేదు. -----జీడిపిలో మాన్యుఫాక్చరింగ్ భాగస్వామ్యం 2019లో 13 శాతం, 2016-–18లో 15 శాతం ఉంది. ఇప్పుడు 17.7 శాతం ఉంది అంటున్నారు. 1990లోను 16 నుంచి 17 శాతం ఉండేది. 2014లో మేక్ ఇన్ ఇండియా నినాదం పీఎం మోదీ ఇచ్చారు. ఇన్వెస్టర్ గ్రోత్ మీద ఎన్నో హామీలు ఇచ్చారు. పది ఏండ్లలో మాన్యుఫాక్చర్ రంగంలో అసలు ప్రోగ్రెస్ లేదు. బ్యాంక్ లలో  డబ్బులు పెడుతున్నవారికి ఎంత లాభం కలుగుతున్నది.  ఇంటిలో నిత్యం ఉపయోగించే వస్తువులు, బట్టలు, ఇతర సామగ్రి ఏదైనా కావచ్చు  
ఫుట్ పాత్​పై  నాణ్యతతో సంబంధం లేకుండా  కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది అంటే అతిశయోక్తి కాదు.  

- ఎండి మునీర్,  
సీనియర్ జర్నలిస్ట్