
ధర్పల్లి, వెలుగు : విషపు నీరు తాగి 65 గొర్రెలు, మేకలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని ఒన్నాజీపేట్లో జరిగింది. అధికారులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాసబోయిన సతీష్ ఇదివరకే పొలానికి పిచికారీ చేసి నిల్వ చేసిన యూరియా, గుళికలు వంటి సంచులను సోమవారం బోరు నీటితో శుభ్రం చేసుకుని వెళ్లాడు. దీంతో మందుతో కలిసి బోరునీరు పొలంలో పారింది. మంగళవారం అదే గ్రామానికి చెందిన పెద్దోల్ల పెద్ద రాజయ్యకు చెందిన 25, పెద్దొల్ల గంప రాజయ్యకు చెందిన 40 గొర్రెలు, మేకలు విషపు నీటిని తాగి మృతి చెందాయి.
తహసీల్దార్ మాలతి, పశువైద్యాధికారి అభిషేక్, ఏఎస్సై దుర్గాప్రసాద్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. తాగునీరు, మట్టి శాంపిళ్లు తీసుకుని ల్యాబ్‌కు పంపించారు. గొర్రెలు, మేకల మృతితో సుమారు రూ.6.50 లక్షల నష్టం జరిగిందని, జీవనోపాధి కోల్పోయామని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు.