- 4,300 కాలనీలకు గాను 648 చోట్లే ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు:జీహెచ్ఎంసీ పరిధిలోని కాలనీల్లో సరిపడా గ్రీన్పార్కులు లేకపోవడంతో జనాలకు ఆహ్లాద వాతావరణం దూరమవుతోంది. కాలనీ విస్తీర్ణంలో 10 శాతం పార్కులకు కేటాయించాల్సి ఉన్నా చాలా చోట్ల వాటి ఊసేలేదు. కొత్తగా పుట్టుకొస్తున్న కాలనీల్లో అయితే గ్రీన్ పార్కుల మాట కాగితాల్లోనే ఉంటుంది. ఉన్నచోట పర్యవేక్షణ, నిర్వహణ లేక పార్కులు ఆకతాయిలకు అడ్డాలుగా మారుతున్నాయి. చెత్తా చెదారంతో నిండిపోతున్నాయి. వాకింగ్ట్రాకులు, క్లీనింగ్లేక డైలీ వాకింగ్‌కు వచ్చే పెద్దలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పార్కు కోసం స్థలం ఉన్నా గ్రీనరీ పెంచి డెవలప్చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
చూసీ చూడనట్టు..
సిటీలో 4,300ల కాలనీలు ఉండగా వీటిలో 648 చోట్ల మాత్రమే గ్రీన్పార్కులు ఉన్నాయి. ఇంకా 3,652 కాలనీల్లో పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉంది. వాస్తవానికి కాలనీ విస్తీర్ణంలో10 శాతం పార్కు కోసం స్థలం కేటాయించాలి. అందులో మొక్కలతోపాటు వాకింగ్ ట్రాక్స్, పిల్లల కోసం ప్లే ఏరియా, బెంచీలు, రీక్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. కానీ సిటీలోని కాలనీల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దాదాపు 66 శాతం కాలనీల్లో గ్రీన్ పార్కులు లేవు. జనాభాకు అనుగుణంగా పార్కుల నిర్మాణం జరగడం లేదు. దృష్టి పెట్టాల్సిన అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. కాలనీ ఏర్పాటు సమయంలో వదిలేసిన పార్కు స్థలాన్ని ఇతర కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఉన్న వాటిని పట్టించుకుంటున్నారా అంటే అదీ లేదు. దాదాపు 50 శాతం కాలనీ పార్కులు చెత్తా చెదారంతో నిండి ఉంటున్నాయి. మరి కొన్నిచోట్ల వాకింగ్ట్రాకులు లేక పిచ్చి మొక్కలతో అడవిని తలపిస్తున్నాయి. ఇలాంటి ప్లేసులు ఆకతాయిలకు అడ్డాగా మారాయి. కాలనీల వాసులు ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం ఉండడం లేదని చెబుతున్నారు. కొన్ని పార్కుల మెయింటెనెన్స్ కు నెలనెలా ఫండ్స్ పడుతుంటే మరికొన్నింటికి లేట్అవుతున్నాయని అసోసియేషన్ల మెంబర్లు చెబుతున్నారు. కనీసం బల్దియా సిబ్బంది వచ్చి క్లీన్ చేయడం లేదని కాలనీల వాసులు అంటున్నారు. ట్రీ పార్కులు, థీమ్ పార్కులంటూ కోట్లకు కోట్లు కేటాయిస్తున్న జీహెచ్ఎంసీ కాలనీ పార్కుల మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ఎవరికీ అనుకూలంగా లేదు
వందల కుటుంబాలు ఉండే ఓయూ కాలనీలో బల్దియా చిన్న స్థలంలో పార్కును ఏర్పాటు చేసింది. అక్కడికి వెళ్లి ప్రశాంతంగా కూర్చుందామంటే బెంచీలు ఉండవు. గ్రీనరీ లేదు. ఉన్న కొద్ది జాగాలోనే సగానికి పైగా ఓపెన్ జిమ్‌కు కేటాయించారు. పిల్లలకు, వృద్ధులకు అనువైన వాతావరణం లేదు.
- సాయి, ఓయూ కాలనీ
బీరు బాటిళ్లు, ఫుడ్ ప్యాకెట్లు
మా కాలనీలో పార్కు ఉన్నా మొత్తం చెత్తా చెదారంతో నిండి ఉంటోంది. వాకింగ్ ట్రాకులు సక్కగా లేవు. పొద్దున్నే వెళ్తే బీరు బాటిళ్లు, ఫుడ్ ప్యాకెట్లు పడేసి ఉంటున్నాయి. పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు ఒక్కటీ మంచిగా లేవు. నిర్వహణ లేకనే పార్కు ఇలా తయారైంది.