- మరో 51 మందికి గాయాలు
అంకారా : తుర్కియేలోని హోటల్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బోలు ఫ్రావిన్స్లోని గ్రాండ్ కర్తాల్ హోటల్‌లో మంగళవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 66 మంది చనిపోయారు. మరో 51 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో హోటల్‌లో 234 మంది గెస్టులు ఉన్నారు. మంటలను చూసి భయాందోళనతో వారు తాళ్లు, బెడ్ షీట్ల సహాయంతో కిటికీల నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ క్రమంలోనే మంటలను తప్పించుకునే ప్రయత్నంలో ఇద్దరు టూరిస్టులు బిల్డింగ్ పైనుంచి దూకారు.
తీవ్రగాయాలతో వారిద్దరూ స్పాట్లోనే చనిపోయారని తెలిపారు. మిగిలిన వారిలో కొందరు మంటల్లో చిక్కుకొని, మరికొందరు దట్టంగా అలుముకున్న పొగ కారణంగా ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. హోటల్‌లో అందరూ గాఢ నిద్రలో ఉండగా మంటలు చెలరేగాయని హోటల్ స్కీ ఇన్ స్ట్రక్టర్ నెక్మీ కెప్సెటుటన్ తెలిపారు. మంటలను గమనించిన వెంటనే తాను హోటల్నుంచి బయటకు వచ్చానని చెప్పారు. హోటల్ మొత్తం పొగ కమ్ముకోవడంతో గెస్టులను కాపాడడం కష్టంగా మారిందన్నారు. అయినప్పటికీ, తాను 20 మంది గెస్టులకు సహాయం చేశానని వివరించారు.
హోటల్‌లో తన స్టూడెంట్లు కొంతమంది బస చేశారని, పొగ కారణంగా వాళ్ల గదుల వద్దకు వెళ్లేలేకపోయానని చెప్పారు. కాగా, హోటల్‌లో మంటలు చెలరేగడానికి కారణాలేంటనేది ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. మరోవైపు, అగ్ని ప్రమాదం ఘటనపై దర్యాప్తు చేయడానికి తుర్కియే ప్రభుత్వం ఆరుగురు ప్రాసిక్యూటర్లను నియమించింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే 30 ఫైరింజన్లు, 28 అంబులెన్సులను స్పాట్ కు పంపించామని అధికారులు పేర్కొన్నారు.