రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీకి బుధవారం మొదటి దశ ఎన్నికలు నిర్వహించారు. ఈ దశలో 43 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా.. 66.18% పోలింగ్ నమోదైంది. 17 జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మాజీ సీఎం చంపయీ సోరెన్, మాజీ ఎంపీ గీతా కోరా సహా మొత్తం 683 మంది అభ్యర్థులు ఈ దశలో బరిలో నిలిచారు. సెరాయ్ కేలా ఖార్సావాన్లో అత్యధికంగా 66.38% పోలింగ్ రికార్డయింది.
లోహార్ దాగాలో 65.99, గుమ్లాలో 64.59, సిమ్ డేగాలో 64.31, ఖుంటీలో 63.35, లాతెహార్ లో 62.81, గర్వాలో 61.06, వెస్ట్ సింగ్ భూమ్ లో 60.35, రామ్‌గఢ్‌లో 59.22, ఈస్ట్ సింగ్ భూమ్లో 58.72, చాత్రాలో 58.23% పోలింగ్ నమోదైంది. రాంచీలో అతితక్కువగా 53.40% ఓటింగ్ రికార్డయింది. కాగా.. ఎన్నికల సందర్భంగా ప్రతిఒక్కరూ ఓటుహక్కు వాడుకోవాలని, ఫస్ట్ టైం ఓటర్లందరూ తప్పనిసరిగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఉత్సాహంగా ఓటువేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గాంగ్వార్ ‘ఎక్స్’లో కోరారు. ఓటువేసిన తర్వాతే రిఫ్రెష్ కావాలని వారు సూచించారు. గవర్నర్ గాంగ్వార్ రాంచీలో ఓటు వేశారు. మరోసారి కూడా తమకే అవకాశం కల్పించాలని సీఎం హేమంత్ సోరెన్ ‘ఎక్స్’ లో ఓటర్లను కోరారు. ఈసారి గెలిపిస్తే పదేండ్లలో చేయాల్సిన అభివృద్ధి పనులను ఐదేండ్లలోనే చేస్తామని హామీ ఇచ్చారు.
15,344 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు మొత్తం 15,344 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 1,152 కేంద్రాల్లో మహిళలే విధులు నిర్వహించారు. 24 పోలింగ్ కేంద్రాలను వికలాంగులు నిర్వహించారు.
వయనాడ్, చెళక్కరలో 65 శాతం పోలింగ్
వయనాడ్: కేరళలో వయనాడ్, చెళక్కరకు బుధవారం ఉప ఎన్నికలు నిర్వహించారు. వయనాడ్ లోక్ సభ నియోజకవర్గానికి 65% పోలింగ్ నమోదైంది. చెళక్కర అసెంబ్లీ నియోజకవర్గానికి 50.86% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. కొన్ని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించగా.. అధికారులు వెంటనే రెక్టిఫై చేసి పోలింగ్ కొనసాగించారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో భావోద్వేగపరమైన దృశ్యాలు కనిపించాయి. ఈ ఏడాది జూన్‌లో వయనాడ్‌లో వరదల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో స్థానికులు వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. చాలా రోజుల తరువాత ఓటు వేయడానికి వచ్చారు. వారంతా ఒకరినిచూసి మరొకరు భావోద్వేగానికి గురయ్యారు. వరద బాధితులు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి అధికారులు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేశారు.