అమెరికాలో విమానం, హెలికాప్టర్ ఢీకొని 67 మంది మృతి!

అమెరికాలో విమానం, హెలికాప్టర్ ఢీకొని 67 మంది మృతి!
  • అమెరికాలో ఘోర ప్రమాదం 
  • పొటోమాక్ నదిలో కుప్పకూలిన ఫ్లైట్, చాపర్​​
  • వైట్​హౌస్​కు 5 కిలో మీటర్ల దూరంలోనే ప్రమాదం
  • నదిలో నుంచి 28 డెడ్​బాడీల వెలికితీత
  • ప్రమాదంలో ఎవరూ బతికే చాన్స్ లేదన్న అధికారులు
  • ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ట్రంప్​
  • ఎయిర్ కంట్రోల్ ప్రొసీజర్​పై అసహనం

వాషింగ్టన్: అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. 64 మందితో వెళ్తున్న ఓ ప్యాసింజర్​ ఫ్లైట్,  ముగ్గురు సైనికులతో వెళ్తున్న ఆర్మీ హెలికాప్టర్​  ఢీకొన్నాయి.  బుధవారం రాత్రి 9 గంటలకు వాషింగ్టన్ లోని ఎయిర్‌‌‌‌పోర్టులో విమానం ల్యాండ్‌‌‌‌ అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది. దీంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించి, విమానం, హెలికాప్టర్ ముక్కలై  పొటోమాక్‌‌‌‌ నదిలో పడ్డాయి. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌‌‌‌హౌస్‌‌‌‌  కు 5 కి.మీ. దూరంలోనే ఈ ఘటన జరిగింది. 

వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ 28 డెడ్​బాడీలను వెలికితీశారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఈ ఘటనలో 67 మంది మృతిచెంది ఉంటారని, ఎవరూ బతికే అవకాశం లేదని వాషింగ్టన్​ ఫైర్​ డిపార్ట్ మెంట్ చీఫ్‌‌‌‌ జాన్​ డొన్నెలీ వెల్లడించారు. గత 24 ఏండ్లలో అమెరికాలో ఇదే అతిపెద్ద ప్రమాదమని ఆయన పేర్కొన్నారు. విమానం తలకిందులుగా నది అడుగుభాగంలో కూరుకుపోయిందని, అక్కడికి దగ్గర్లోనే హెలికాప్టర్‌‌‌‌ శకలాలను కూడా గుర్తించామని తెలిపారు. తాను స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు. 

అసలేం జరిగిందంటే?

అమెరికన్​ ఎయిర్​లైన్స్ కు చెందిన ఈగల్​ ఫ్లైట్ ​ 5342 ను పీఎస్‌‌‌‌ఏ ఎయిర్‌‌‌‌లైన్స్‌‌‌‌ నిర్వహిస్తున్నది. ఇది  బుధవారం రాత్రి 9.00 గంటల ప్రాంతంలో (అమెరికా కాలమానం) కాన్సాస్‌‌‌‌లోని విషిటా నుంచి బయల్దేరింది. వాషింగ్టన్‌‌‌‌  సమీపంలోని రోనాల్డ్‌‌‌‌ రీగన్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టు రన్‌‌‌‌వేపై దిగేందుకు ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోల్​ (ఏటీసీ) క్లియరెన్స్‌‌‌‌ ఇవ్వగా.. సరిగ్గా అదే సమయానికి అమెరికన్​ ఆర్మీకి  చెందిన సికోర్‌‌‌‌స్కీ యూహెచ్‌‌‌‌-60 బ్లాక్‌‌‌‌హాక్‌‌‌‌ హెలికాప్టర్‌‌‌‌ ఆ రూట్లోకి  వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్​ట్రాఫిక్​ కంట్రోలర్​.. హెలికాప్టర్‌‌‌‌కు సమాచారమిచ్చారు.  ‘‘మీ ముందు విమానం వస్తోంది కన్పిస్తుందా?’ అని అడిగారు. ఆ మరుక్షణమే మరో రేడియో కాల్‌‌‌‌ను పంపించారు. అనంతరం 30 సెకన్లలోపే ఫ్లైట్, హెలికాప్టర్​ ఢీకొన్నాయి. ఆ సమయంలో గగనతలంలో భారీ శబ్దం వినిపించింది. ఆకాశంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడుతో ముక్కలైపోయిన విమానం, చాపర్ శకలాలు నదిలో పడిపోయాయి.  

రంగంలోకి ఫైర్​ బోట్స్​

ప్రమాద సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులతోపాటు నలుగురు సిబ్బంది ఉన్నట్టు అమెరికన్​ ఎయిర్​లైన్స్​ వెల్లడించింది.  ఇందులో యూఎస్​ఫిగర్​ స్కేటింగ్ కమ్యూనిటీ మెంబర్స్​ కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి.​ అలాగే, మిలిటరీ శిక్షణ హెలికాప్టర్​లో ముగ్గురు సైనికులు మాత్రమే ఉన్నారని, సీనియర్​ అధికారులెవరూ లేరని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ప్రమాద సమాచారం తెలియగానే అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. చీకట్లోనే ఫైర్​ బోట్లతో గాలింపు చేపట్టారు. డజన్లకొద్దీ ఫైర్​ ట్రక్కులు నది వద్దకు చేరుకొన్నాయి. 

 అత్యంత కఠినమైన పరిస్థితుల మధ్య  డైవర్స్ ​గాలింపు చేపట్టారు. కాగా, తాము అధికారులతో సహాయక చర్యలపై సంప్రదింపులు జరుపుతున్నామని, ప్రయాణికులు, సిబ్బంది పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నామని అమెరికన్​ ఎయిర్​లైన్స్​ సంస్థ వెల్లడించింది.  ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారులు ఇంకా నిర్ధారించలేదు. నేషనల్​ ట్రాన్స్​పోర్టేషన్​ సేఫ్టీ బోర్డ్​ (ఎన్​టీఎస్​బీ), ఫెడరల్​ ఏవియేషన్​ అడ్మినిస్ట్రేషన్​(ఎఫ్ఏఏ)కు చెందిన ఇన్వెస్టిగేషన్ అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణాన్ని గుర్తించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. లిపారు.

గడ్డ కట్టేంత చల్లగా నీళ్లు..  

విమానం, హెలికాప్టర్​ శకలాలు పడిన పొటోమాక్​ నదిలో టెంపరేచర్ మైనస్​ 1–2 డిగ్రీ లకు పడిపోయిందని,  దీనివల్ల ఒక్కసారిగా బాధితుల శరీరాలు కోల్డ్ షాక్​కు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు తెలిపారు. గడ్డ కట్టే చలిలో వీరికి శ్వాస తీసుకోవడంతోపాటు హైపర్ రీవెంటిలేషన్ వంటి పరిస్థితి తలెత్తవచ్చని  చెబుతున్నారు. ఎక్కువ సేపు ఈ నీటిలో ఉంటే ప్రాణాపాయం తప్పదంటున్నారు. ఇంత తక్కువ ఉష్ణోగ్రత ఉన్న నీటిలో ఉన్న మనిషికి 15 నిమిషాల్లోనే స్పృహ కోల్పోయే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. 

హెలికాప్టర్ కిందికో, పైకో ఎందుకు వెళ్లలే?: ట్రంప్ 

విమానం, ఆర్మీ హెలికాప్టర్​ ఢీకొన్న ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర   దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.​ ఇది నివారించదగ్గ ప్రమాదమని, ఇలా జరగడం దారుణమన్నారు. ఫ్లైట్​ సరైన దిశలోనే ఉండగా.. హెలికాప్టర్​ మాత్రం నేరుగా విమానంవైపు వెళ్లిందన్నారు. ఆ సమయంలో క్లియర్​ స్కై ఉన్నదని, ఫ్లైట్​ లైట్లన్నీ వెలుగుతున్నాయని, అయినా హెలికాప్టర్​ కిందికో.. మీదికో.. పక్కకో ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఆ సమయంలో విమానాన్ని చూశారా అని కంట్రోల్ రూం​ హెలికాప్టర్​ పైలట్​ను అడిగిందని, కానీ  ఏం చేయాలో ఎందుకు చెప్పలేదని అన్నారు.   

గతంలోనూ ప్రమాదాలు..

ఎయిర్ ఫ్లోరిడా ఫ్లైట్ 90: వాషింగ్టన్ డీసీలో 1982, జనవరి 13న ఎయిర్ ఫ్లోరిడా ఫ్లైట్ 90 మంచు తుఫానుతో కుప్పకూలింది. ఫోర్ట్ లాడర్‌‌‌‌ డేల్‌‌‌‌ కు బయలుదేరిన బోయింగ్ 737–-222 విమానం రెక్కలపై మంచు పేరుకుపోయింది. డీ-ఐసింగ్ ప్రక్రియలో లోపాలతో టేకాఫ్ అయిన తర్వాత విమానం నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. అనంతరం మంచుతో నిండిన పొటోమాక్ నదిలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 78 మంది ప్యాసింజర్లు మరణించారు. 

ఈస్టర్న్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్: ఈస్టర్న్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్–537.. 1949, నవంబర్ 1న  పీ–-38 లైట్నింగ్ ఫైటర్ జెట్‌‌‌‌ ను ఢీకొట్టింది.  పొటోమాక్ నదిలో విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తంగా 55 మంది మరణించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌‌‌‌, ఫైటర్ జెట్‌‌‌‌ ల మధ్య సమాచార లోపంతో  ఈ ప్రమాదం సంభవించింది. 

ఎఫ్–14 టామ్ క్యాట్ ట్రైనింగ్ ప్లైట్: గ్రుమ్మన్ ఎఫ్–14 టామ్ క్యాట్ ట్రైనింగ్ ఫ్లైట్  పొటోమాక్ నదిలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఇద్దరు సిబ్బంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఇంజన్ వైఫల్యమే ప్రమాదానికి కారణమని అధికారులు తేల్చారు.  

హడ్సన్ నదిలో మిరాకిల్: యూఎస్ ఎయిర్ వేస్ ఫ్లైట్– 1549 కూడా 2009, జనవరి 15న ప్రమాదానికి గురైంది. న్యూయార్క్ లోని లాగార్డియా ఎయిర్ పోర్ట్   నుంచి బయలుదేరిన విమానం కొద్ది నిమిషాల తర్వాత  బాతుల మందను ఢీకొట్టింది. దీంతో విమానంలోని రెండు ఇంజన్ లు విఫలమై హడ్సన్ నదిలో ఫ్లైట్ కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి155 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.