మోదీ చెప్పిన వినట్లే..! 67 ఏళ్ల వృద్ధురాలిని బెదిరించి 14 లక్షలు దోచేశారు

మోదీ చెప్పిన వినట్లే..! 67 ఏళ్ల వృద్ధురాలిని బెదిరించి 14 లక్షలు దోచేశారు

కుర్చీలో కూర్చోని ముందు కంప్యూటర్ పెట్టుకొని.. ఏం మాత్రం కష్టపడకుండా కోట్లు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే నేరగాళ్లు.. డిజటల్ అరెస్టుల రూపంలో అమాయకపు ప్రజల నుంచి రూ.120 కోట్లు కాజేశారు. ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం(అక్టోబర్ 27) మన్ కీ బాత్ ప్రసంగంలో వెల్లడించారు. సైబర్ క్రైమ్స్ పై ప్రజలకు అవగాహన అవసరమన్న భారత ప్రధాని..  డిజిటల్ అరెస్టుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని  ప్రజలకు సూచించారు. ఇలాంటి నేరాలకు అవగాహనతోనే అడ్డుకట్ట వేయగలమని చెప్పారు. ఈ ప్రసంగం ముగిసిన గంటల వ్యవధిలోనే సైబర్ నేరగాళ్లు.. ఓ 67 ఏళ్ల వృద్ధురాలి నుంచి రూ. 14 లక్షలు కొట్టేశారు. 

మనీ లాండరింగ్ పేరుతో బెదిరింపులు

హై ప్రొఫైల్ మనీ లాండరింగ్ కేసులో వృద్ధురాలి ప్రమేయం ఉందని ఆరోపించిన నిందితులు ఆమెను డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించారు. ఢిల్లీ సైబర్ క్రైమ్ బ్రాంచ్‌లో ఆమెపై కేసు నమోదైందని చెప్పారు. నకిలీ పోలీసు లేఖలు పంపి మూడు నుండి ఐదేళ్ల వరకు వరకు జైలు శిక్ష విధించవచ్చని భయపెట్టారు. ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే, బాధితురాలికి చెందిన డబ్బు మొత్తాన్ని తాము సూచించిన ఖాతాకు బదిలీ చేయాలని హెచ్చరించారు. విచారణ పూర్తయ్యాక డబ్బు తిరిగి బదిలీ చేస్తామని నమ్మించారు. 

ALSO READ | | నాలుగు నెలల్లో రూ.120 కోట్లు కొట్టేశారు : వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి : ప్రధాని మోదీ

వారి మాటలు నమ్మిన బాధితురాలు హుటాహుటీన బ్యాంకుకు వెళ్లి.. ఖాతాలో ఉన్న డబ్బులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు అన్నీ క్లెయిమ్ చేసి మొత్తం రూ.14 లక్షలు సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేసింది. రోజులు గడుస్తున్నా.. డబ్బు తిరిగి అకౌంట్‌లో జమకాకపోవడంతో.. బాధితురాలు జరిగిన విషయం కొడుక్కి చెప్పింది. సైబర్ నేరాలపై అవగాహన ఉన్న అతను జరిగిన మోసం గురించి తల్లికి వివరించాడు. అనంతరం కోడలు సహాయంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కొడుకు విదేశాల్లో ఉండగా.. బాధితురాలు తన కోడలుతో కలిసి ముంబైలోని కండివాలి వెస్ట్‌లో నివాసముంటోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.